జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత పార్టీ మీద పూర్తి ఫోకస్ పెడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏడు నెలలుగా పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అదే విధంగా టీడీపీ కూటమిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పార్టీ నుంచి మరో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. కొందరు నేతలకు నామినేటెడ్ పదవులు లభించాయి.
పార్టీలోకి కొత్త వారు వచ్చి చేరుతున్నారు. ఏపీలో టీడీపీ తరువాత ఎక్కువ చేరికలు జనసేనలోనే అన్నది కూడా అంతా అంటున్న మాట. ఈ నేపధ్యంలో పార్టీని రానున్న నాలుగేళ్ళలో ఎలా విస్తరించాలి దానికి ఏమేమి చేయాలి అన్న దాని జనసేనాని ఫుల్ ఫోకస్ పెడుతున్నారు.
ఇక చూస్తే 2029 నాటికి షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు ఏపీలో జరుగుతాయి. అంటే బిగిసి నాలుగేళ్ళ టైం ఉంది. ఈ సమయం జనసేనకు చాలా కీలకం అని అంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటారు. అంతే కాదు పార్టీని పటిష్టం చేసుకోవాలని కూడా అంతా చూస్తారు.
ఇపుడున్న పరిస్థితుల్లో జనసేన అధినేతగా పవన్ కి కూటమి ప్రభుత్వంలో విశేష అధికారాలు ఉన్నాయి. దాంతో ఆయన ఈ అధికారాన్ని అవకాశాన్ని ఉపయోగించుకుని జనసేనను బలోపేతం చేసే దిశగా భారీ యాక్షన్ ప్లాన్ ని రూపొందిస్తారు అని అంటున్నారు.
ఇకపోతే 2024 ఎన్నికల్లో కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకుని జనసేన పోటీ చేసింది. అయితే పోటీ చేసిన ప్రతీ చోటా గెలిచి కొత్త రికార్డు నెలకొల్పింది. అంతవరకూ బాగానే ఉన్నా మిగిలిన చోట్ల బలం ఉన్నా జనసేన నాయకులు పొత్తుల కారణంగా పోటీ చేయలేకపోయారు.
దాంతో ఈసారి జరిగే ఎన్నికల్లో పోటీ పడాలని వారు అప్పటి నుంచే ఆలోచిస్తూ వస్తున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన జరిగి భారీగా సీట్లు పెరుగుతాయని అంటున్నారు. అలా చూస్తే కనుక 2029 నాటికి 175 సీట్లు కాస్తా 225 గా మారుతాయని అంటున్నారు. అంటే ఈ పెద్ద మొత్తంలో ఉండే సీట్లలో జనసేన కచ్చితంగా పొత్తులో భాగంగా మూడవ వంతు సీట్లు కోరుతుంది అని అంటున్నారు. అంటే 75 దాకా సీట్లు అన్న మాట. మరి ఇప్పటికి 21 సీట్లలో ఎమ్మెల్యేల బలం ఉన్న 75 సీట్లలో తన అభ్యర్థులను పెట్టాలీ అంటే బలంగా ఉన్న నియోజకవర్గాలను గురించి ఇప్పటి నుంచే అక్కడ ఫుల్ ఫోకస్ పెట్టాల్సి ఉంది.
దాంతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి ప్రజలలో ప్రచారం చేయాలి. అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ తీసుకుంటున్న అనేక సంచలనాత్మకమైన నిర్ణయాలను జనంలో ఉంచడం ద్వారా పార్టీకి మద్దతు పెరిగేలా చూసుకోవాలి.
ఆ దిశగా వారికి పవన్ దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు. ప్రతీ సారీ జనసేన ప్లీనరీ ఒక్క రోజు మాత్రమే జరుగుతుంది. కానీ ఈసారి 12 13 14 మూడు రోజుల పాటు ప్లీనరీని జనసేన నిర్వహిస్తోంది. దాని ఉద్దేశ్యం కూలంకషంగా పార్టీ కార్యక్రమాల గురించి లోతైన చర్చను జరపాలని అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.
అలాగే పవన్ ప్లీనరీలో ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆ తరువాత వరుసగా మూడు రోజుల పాటు అనేక అంశాల మీద తీర్మానాలు ఉంటాయి. మూడవ రోజున బహిరంగ సభ జరగనుంది ఆ సభలో పవన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన ఏమి ప్రసంగం చేస్తారు అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఇక జనసేన ప్లీనరీ సమావేశాలు పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోని చేబ్రోలులో జరుగుతుందని అంటున్నారు. అక్కడ పవన్ కొన్న సొంత భూమిలోనే పార్టీ ప్లీనరీ జరుగుతుందని అంటున్నారు. మొత్తానికి జనసేనను సొంతంగా బలపరచుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్లాలి అన్న దాని మీద చర్చిస్తారు అని అంటున్నారు. దాంతో జనసేన ప్లీనరీ సమావేశాలు రెండు నెలల ముందు నుంచి సందడిని పెంచేస్తున్నాయని అంటున్నారు.