ఆధ్యాత్మిక మోడీ...!

నరేంద్ర మోడీ నిండా ఆధ్యాత్మికతను నింపుకున్నారు. ఆయన గత పది రోజులుగా ఉపవాస దీక్షలో ఉన్నారు.

Update: 2024-01-21 12:30 GMT

నరేంద్ర మోడీ నిండా ఆధ్యాత్మికతను నింపుకున్నారు. ఆయన గత పది రోజులుగా ఉపవాస దీక్షలో ఉన్నారు. దేవాలయాల సందర్శన చేస్తున్నారు. రామ భజనలో తరిస్తున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం సందర్భంగా బాల రాముడి విగ్రహాన్ని తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ నెల 22న దేశమంతా ఆధ్యాత్మిక పండుగ వాతావరణం నెలకొంది.

ఇక ప్రధాని మోడీ అయితే శ్రీరామభక్తుడిగా కోట్లాది జనాలకు కనిపిస్తున్నారు. ఒక దేశ ప్రధాని ఈ విధంగా అత్యంత భక్తి ప్రపత్తులు ప్రదర్శించడం ఆధునిక భారత దేశంలో ఎవరూ ఇంతవరకూ చూడలేదు. నరేంద్ర మోడీ స్వతహాగా భక్తుడు. పైగా ఆరెస్సెస్ భావజాలం నిండా ఉన్న వారు. అంతే కాదు భారతీయతతో పాటు హిందూత్వ సిద్ధాంతాన్ని అందిపుచ్చుకున్న వారు.

ఆయన నాయకత్వం వహిస్తున్న బీజేపీ కూడా మెజారిటీ హిందువుల కోసం పోరాడుతోంది. దాంతో నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం కూడా అత్యంత సాహసంగా అయోధ్యంలో రామాలయ నిర్మాణానికి అవసరం అయిన పరిస్థితులను కల్పించింది 2020 కరోనా టైం లో అయోధ్యలో రాముడి కోవెల కోసం నిరమాణం పనులు ప్రారంభం అయ్యాయి. మూడేళ్ల వ్యవధికి భవ్యమైన ఆలయం నిర్మాణం జరిగింది.

అయిదు వందల ఏళ్ళ నాటి రామాలయ వివాదాన్ని పరిష్కరించిన ఘనత అక్షరాలా మోడీకే దక్కింది. ఈ విషయంలో రెండవ మాట లేదు. అందుకే రామ జపంతో జాతి మొత్తం తరిస్తోంది. నరేంద్ర మోడీ అయితే దక్షిణ భారత దేశ యాత్రలో తీరిక లేకుండా ఉన్నారు. ఆయన రామాయణంతో రాముడితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ఆలయాలు అన్నీ కూడా సందర్శిస్తున్నారు.

తమిళనాడులోని రామేశ్వరం వెళ్ళి అక్కడ సముద్రంలో స్నానాలు చేసిన మోడీ ఆపై రామేశ్వరం వెళ్లిన ప్రధాని అక్కడి ఆలయంలోని పవిత్ర తీర్థాల్లో పుణ్య స్నానం ఆచరించారు. ప్రతీ తీర్థం దగ్గర ప్రధాని పుణ్య స్నానం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇపుడు వైరల్ గా మారాయి. అక్కడే స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చెప్పే రామేశ్వర లింగానికి పూజలు చేశారు. అదే విధంగా శనివారం శ్రీరంగంలోని రంగనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఆదివారం అయితే ధనుష్కోడిలోని అరిచల్ మునై పాయింట్ ను ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. రామ సేతు తీరంలో ప్రాణాయామంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి కోదండ రాముడిని దర్శించుకున్నారు. వానరసేనతో కలిసి శ్రీరాముడు లంకను చేరేందుకు ధనుష్కోడి తీరానికి వచ్చినట్లు సముద్రం దాటేందుకు రాళ్లతో వంతెన నిర్మించినట్లు రామాయణ గాథలో వివరించిన విషయం తెలిసిందే. రామ సేతుగా వ్యవహరించే ఈ వంతెన ఆనవాళ్లు ఇప్పటికీ సముద్రంలో కనిపిస్తాయి.

మొత్తం మీద చూస్తే అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రామాయణంతో సంబంధం ఉన్న పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఆధ్యాత్మిక భావనను దేశమంతా వెదజల్లుతున్నారు. ఒక దేశ ప్రధాని ఇంతలా ఆధ్యాత్మిక పర్యటనలలో బిజీగా ఉండడం మాత్రం ఇంతకు ముందు ఎపుడూ జరగలేదు. దాంతో మోడీని దేశాన్ని ఏలే ప్రధానిగా కాకుండా ఒక ఉత్తమ ఆధ్యాత్మికవేత్తగా సైతం జనాలు చూస్తున్నారు.

Tags:    

Similar News