"అల్లు అర్జున్ సినిమా హీరో కావొచ్చు కానీ"... డీజీపీ కీలక వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడటం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ వ్యవహార శైలిని తప్పుబట్టింది.
సంధ్య థియేటర్ వద్ద తీవ్ర తొక్కిసలాటకు, ఆ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడానికి, నేడు శ్రీతేజ్ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ లో ఆ పరిస్థితుల్లో ఉండటానికి అల్లు అర్జున్ వ్యవహరించిన తీరే కారణం అంటూ ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చిన పరిస్థితి అని అంటున్నారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ స్పందించారు.
అవును... పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన పై రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతరం.. ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన డీజీపీ... సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని అన్నారు. ప్రధానంగా తాము అల్లు అర్జున్ కు వ్యతిరేకం కాదని.. చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదని తెలిపారు.
ప్రతి ఒక్కరి భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని.. అన్నింటికంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత అని అన్నారు. ప్రధానంగా... ఆయన సినిమాల్లో హీరో కావొచ్చు కానీ.. క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతోందో, సామాజిక సమస్యలు ఏమిటి అనేది అర్ధం చేసుకోవాలని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో... ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ఎంతమాత్రమూ ప్రాధాన్యత గల అంశం కదని ఆయన స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ తప్పు జరిగిపోయిందని.. ఇలాంటి ఘటనలు సమాజానికి ఏమాత్రం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా... మహిళలు, చిన్నారుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
కాగా... నాడు సంధ్య థియేటర్ వద్ద జరిగింది పూర్తిగా "యాక్సిడెంట్" అని అల్లు అర్జున్ పదే పదే చెబుతుండగా... తాజాగా రాష్ట్ర డీజీపీ మాత్రం "తప్పు" జరిగిపోయింది అనడం గమనార్హం!