ఇరికించాలంటే ధర్మాన తర్వాతే.. ఈ మాటలేంది పెద్దమనిషి?

ఎన్నికలు దగ్గర్లోకి వచ్చిన వేళ.. కార్యకర్తలు సంతోషంగా లేరన్న మాటతో జరిగే నష్టాన్ని ధర్మాన ఎందుకు గుర్తించలేదు? అని ప్రశ్నిస్తున్నారు

Update: 2023-08-29 09:28 GMT

నేతల మాటలు వారికి నష్టం కలిగేలా ఉండటం ఒక ఎత్తు. కొన్ని సందర్భాల్లో తాము మాట్లాడే మాటలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి చేటుగా మారుతుంటాయి. తాజాగా ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటలు అలానే ఉన్నాయన్న విమర్శ వినిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం సైతం ఇరుకున పడేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సీనియర్ నాయకుడిగా పేరున్న ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అలాంటి నేత నోటి నుంచి తొందరపాటు వ్యాఖ్యలు రావటానికి మించిన దురదృష్టం మరొకటి ఉండదు. శ్రీకాకుళంలో జిల్లా పార్టీ నూత కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. దీనికి హాజరైన ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గ్రామ.. వార్డు సచివాలయ వ్యవసథ గురించి మాట్లాడిన ధర్మాన.. జగన్ పాలనతో సమూల మార్పులు తెచ్చారన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇక్కడే ఆయన తన బ్యాలెన్స్ మిస్ అయ్యారు.

గ్రామ.. వార్డు సచివాలయాలతో పార్టీ కార్యకర్తల చేతిలో ఉన్న అధికారాలు తీసేశారన్న ఆవేదన.. బాధ ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ముఖ్యమంత్రి జగన్ పాలనలో సమూల మార్పులు తెచ్చారు. దీని కారణంగా కార్యకర్తల చేతిలో ఉన్న పవర్ తీసేశారన్న మీ ఆవేదన.. బాధ ఉంది. అది వాస్తవం. నేను కాదనను. ఇలా అయితే ప్రజల్లో పార్టీపై తప్పుడు భావం ఏర్పడే అవకాశం ఉంది. మీరంతా పార్టీ సిద్దాంతాలను అర్థం చేసుుకోవాలి'' అంటూ అనునయించే ప్రయత్నం చేశారు.

ఎన్నికలు దగ్గర్లోకి వచ్చిన వేళ.. కార్యకర్తలు సంతోషంగా లేరన్న మాటతో జరిగే నష్టాన్ని ధర్మాన ఎందుకు గుర్తించలేదు? అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో.. ఆయన నోటి నుంచి మరో మాట వచ్చింది. 'గ్రామాల్లో వైసీపీ నాయకులు చెప్పిన పిల్లల్నే వాలంటీర్లుగా నియమించాం. వారి ద్వారానే ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయి. పేదలకు మేలు చేయటంలో మీ సహకారం ఉంది. పేదలకు సంక్షేమ పలాలు అందుతున్నాయని సంతోషించండి' అంటూ చెప్పిన మాటల్లో.. సచివాలయ సిబ్బంది మొత్తాన్ని వైసీపీ నేతలే డిసైడ్ చేశారంటూ ధర్మాన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా చేస్తుందన్నది ఇప్పుడు చర్చగా మారింది. గ్రామ..వార్డు సచివాలయ వ్యవస్థ మీద ఇప్పటికే విపక్షాలు లక్ష్యంగా చేసుకొని విమర్శలు.. తీవ్రమైన ఆరోపణలు సంధిస్తున్న వేళ.. ధర్మాన నోటి నుంచి వచ్చిన ఈ తరహా మాటలతో మరింత నష్టం వాటిల్లేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News