నోటితో కాదు.. లీగల్ నోటీసుతో రాజకీయం!

ఇక బయట విషయానికి వస్తే రాజకీయ ప్రత్యర్థులు ఎంతటి వారయినా ఆప్యాయతతో కూడిన పలకరింపులు ఉండేవి.

Update: 2024-10-24 12:12 GMT

రాజకీయాలంటే ఒకప్పుడు ఎంతో హుదాతనంతో ఉండేవి. ప్రత్యర్థలు వయసులో చిన్నవారైనా.. గౌరవ ప్రదమైన సంబోధన ఉండేది.. అసెంబ్లీలో అయితే సభా వ్యవహారాలు మరింత హుందాతనంతో సాగేవి. ఇక బయట విషయానికి వస్తే రాజకీయ ప్రత్యర్థులు ఎంతటి వారయినా ఆప్యాయతతో కూడిన పలకరింపులు ఉండేవి. కానీ, రానురాను పరిస్థితులు మారాయి. కాలంతో పాటే నాయకుల తీరూ మారుతోంది. ప్రత్యర్థులను వ్యక్తిగతం టార్గెట్ చేయడం, వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం, కుటుంబాలనూ వివాదాల్లోకి, ఆరోపణల్లోకి లాగడం పరిపాటిగా మారింది.

నువ్వు ఆరోపిస్తే నేను నోటిసిస్తా..

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఏడాదిలో ఎంతో మారాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాయి. వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్కారుకు నిరుడు డిసెంబరులో ప్రజలు వీడ్కోలు పలికారు. మే నెలలో జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీని ఓడించి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. అయితే, అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువుల్లాగా చూశారన్న ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అధికారం మారడంతో అవి ఆత్మరక్షణలో పడ్డాయి. ఈ క్రమంలో తమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తే నోటీసులు ఇచ్చేవరకు పరిస్థితి వెళ్లింది.

కేటీఆర్ అటు సురేఖకు ఇటు సంజయ్ కు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ తానై వ్యవహరించారు. దీంతో ప్రతిపక్షంలోకి వచ్చాక టార్గెట్ అయ్యారు. ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్ ను ఉద్దేశిస్తూ వ్యక్తిగతంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అవి సినిమా, రాజకీయ రంగాల్లో కలకలం రేపాయి. ఈ విషయంలో సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్‌ పై అసత్యాలు మాట్లాడారని ఆరోపించారు. తన గౌరవానికి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే అడ్డగోలుగా మాట్లాడారన్నారు. ఈ విషయం కోర్టుకు వెళ్లిన సందర్భంలోనే.. కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన కామెంట్లకు సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఈ నెల 19న సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డానంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. అవి తన వ్యక్తిత్వాన్ని అవమానపర్చేలా ఉన్నాయని, నిరాధారమైన, పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ నోటీసులిచ్చారు.

కాగా, అమృత్‌ పథకం టెండర్ల విషయంలో తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌ కు సృజన్‌ రెడ్డి ఇటీవల లీగల్‌ నోటీసులు ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీకీ నోటీసులు పంపారు. కేటీఆర్ మాత్రం.. సీఎం రేవంత్ తన బావమరిదితో లీగల్ నోటీసు పంపితే మాట్లాడడం ఆపబోమని వ్యాఖ్యానించారు.

దీనికిముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తెలంగాణ మంత్రి సీతక్క సైతం లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు లీగల్ నోటీసులు పంపి కేటీఆర్ బెదిరించాలని చూస్తున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గతంలో తెలిపారు. కాగా, తప్పుడు కథనం ప్రసారం చేసి తమ పరువుకు భంగం కలిగించారంటూ ఓ టీవీ చానల్, దాని సీఈవోకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు పంపింది.

అయితే, తాజా నోటీసుల కంటే ముందే.. కేటీఆర్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కొండా సురేఖ, మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపడం గమనార్హం.

Tags:    

Similar News