రష్యా ఆస్తులమ్మి.. ఉక్రెయిన్ కు 'రుణం'.. ఇది జి-7 న్యాయం
అనేక ఆంక్షలు.. అంతకుమించిన నిర్ణయాలతో ఆఖరికి రష్యాలోని ఫుడ్ ఔట్ లెట్లనూ మూసివేశాయి.
రెండున్నరేళ్ల కిందట ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి కాలు దువ్వినప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఒంటికాలిపై లేచాయి. అమెరికా పెద్దన్నలాంటి నాటో కూటమి సారథ్యంలో ఇవన్నీ కలిసి రష్యాపై కారాలు మిరియాలు నూరాయి. అనేక ఆంక్షలు.. అంతకుమించిన నిర్ణయాలతో ఆఖరికి రష్యాలోని ఫుడ్ ఔట్ లెట్లనూ మూసివేశాయి. రష్యన్ ఆర్థిక సంస్థలను వెలివేశాయి.. ఆ దేశ చమురు కొనబోమని చెప్పాయి.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి. మొత్తమ్మీద రష్యాను ఏకాకిని చేశాయి.
నాటోలో చేర్చుకుంటామని..
అసలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు వచ్చింది అంటే.. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరతాననడంతో వచ్చింది. పక్కలో బల్లెం లాంటి నాటోను ఏమాత్రం అంగీకరించదు రష్యా. ఎంత చెప్పినా వినకపోవడంతో రష్యా యుద్ధానికి దిగింది. దీంతో ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంది. అంతేకాక ఆ దేశంలోని సైనిక స్థావరాలు సహా అన్నిటినీ లక్ష్యం చేసుకుంది. ఇలా ఉక్రెయిన్ సర్వ నాశనమైంది. ఆ దేశం కోలుకోవాలంటే రూ.50 లక్షల కోట్లు అవసరం.
సొమ్ము ఒకరిది...
తాజాగా ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి జి-7 ముందుకొచ్చింది. 50 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు నిర్ణయించింది. అయితే, ఇదేమీ వారి సొంత సొత్తు కాదు. వాషింగ్టన్ లో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు సమావేశాల్లో జి-7 దేశాల నాయకులు పాల్గొన్నారు. అప్పుడే ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి రుణం అందించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై దాడి ప్రారంభించిన వెంటనే తమ దేశాల్లో ఉన్న రష్యాకు చెందిన ఆస్తులను ఈ దేశాలు స్వాధీనంలోకి తీసుకొన్నాయి. ఈ రెండున్నరేళ్లో వాటిపై వచ్చిన లాభాలనే ఉక్రెయిన్ కు రుణంగా ఆఇవ్వాలని నిర్ణయించాయి. అది కూడా వచ్చే రెండు నెలల తర్వాత నుంచి మొదలుపెట్టనున్నాయి.
సోకొకరిది..
ఈ 50 బిలియన్ డాలర్లలో 20 బిలియన్ డాలర్లు రష్యా బద్ధ శత్రువు అమెరికానే ఇవ్వనుంది. మిగిలిన 30 బిలియన్ డాలర్లను యూరప్, యూకే, కెనడా, జపాన్ తో సహా జీ7 భాగస్వామ్య దేశాల నుంచి అందుతాయి. కాగా, రెండున్నరేళ్ల తర్వాత కూడా ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం మాత్రం దక్కలేదు. ఫిన్లాండ్ వంటి దేశాలు నాటోలో చేరినా.. ఉక్రెయిన్ మాత్రం ఎదురుచూస్తూనే ఉంది. ఇటీవల నాటోలోని 30 దేశాల్లో ఉక్రెయిన్ ను చేర్చుకోవడంపై 7 దేశాలు వ్యతిరేకత కనబరిచాయి. అంటే.. ఉక్రెయిన్ రెంటికీ చెడిన రేవడి కానుంది. కారణం.. నాటోలో ఏ నిర్ణయమైనా అన్ని దేశాల ఆమోదం ఉండాలి. అలాగైతేనే అది చెల్లుతుంది.