రాజుగారి వారసురాలు ఎమ్మెల్యే అవుతారా...!?
తరువాత ప్రజాస్వామ్య యుగంలో కూడా ప్రజల చేత ఎన్నుకోబడి సేవ చేస్తూ వచ్చారు
విజయనగరం జిల్లాలో పూసపాటి వంశీకులకు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎవరికీ లేవు అన్నది తెలిసిదే. ఒకనాడు వారు సంస్థానాల ద్వారా ప్రజలను పాలించారు. రాజులుగా చరిత్రలో నిలిచారు. తరువాత ప్రజాస్వామ్య యుగంలో కూడా ప్రజల చేత ఎన్నుకోబడి సేవ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తమ ఆస్తులను కూడా ప్రజలకు వితరణ చేశారు.
విజయనగరంలో తీసుకుంటే అణువణువూ పూసపాటి వంశీకులదే. అదంతా ప్రజల కోసం దారాదత్తం చేశారు. ఈ రోజులలో భూ కబ్జాలు చేస్తూ వందల ఎకరాలను తమ సొంతం చేస్తున్న తరం ఒక వైపు ఉంటే తమది అయిన విలువైన భూములను ఇచ్చేసిన ఉదారత్వం పూసపాటి రాజులది.
ఇక కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా ఉంటారు. తన గత చరిత్రను వంశాన్ని ఆయన ఎన్నడూ చెప్పుకోలేదు. అలాగే ప్రజలు కూడా ఆదరించారు. అయితే ఎన్నికల రాజకీయాల్లో ఒక్క ఓటు తక్కువ వచ్చినా ఓటమే. అలా 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఓటమి పాలు అయ్యారు. ఇక 2019లో ఎంపీగా ఉంటూ మరోసారి ఓటమి పాలు అయ్యారు.
దానిని ఆయన పాజిటివ్ గానే తీసుకున్నారు. అయితే 2019లో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసి విజయాంగరం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. ఆమె ఆ ఎన్నికల్లో ఆరు వేల నాలుగు వందల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఇక ఈసారి మళ్లీ ఆమెకే టీడీపీ టికెట్ ఇచ్చింది. తండ్రి అశోక్ కూడా పూర్తిగా మద్దతుగా నిలిచారు.
తన కుమార్తెని గెలిపించుకుని ఎమ్మెల్యేగా చూడాలని అశోక్ ఆరాటపడుతున్నారు. దాని కోసం తన అనుభవం అంతా ఆయన ఉపయోగిస్తున్నారు. ఇక విజయనగరం ఎమ్మెల్యే సీటులో పీవీజీ రాజు అంటే అశోక్ తండ్రి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన 1952, 1955లలో రెండు సార్లు గెలిచారు. 1978 నుంచి అశోక్ గజపతిరాజు ఇదే సీటులో గెలుస్తూ వస్తున్నారు. ఇపుడు మూడవ తరంలో అదితి గజపతి రాజు గెలిస్తే కనుక ఈ సీటు పూసపాటి వారి పరం అవుతుంది.
లేకపోతే మాత్రం రాజుల చరిత్ర అలా రాజకీయంగా ముగిసినట్లే అని అంటున్నారు. దాంతో ఈసారి గెలుపు కోసం సర్వ శక్తులూ అదితి గజపతిరాజు ఉపయోగిస్తున్నారు. ఆమె గత రెండేళ్ళుగా నియోజకవర్గాన్ని చుట్టబెడుతున్నారు. ఈసారి కూడా ఆమెకు ప్రత్యర్ధిగా వైసీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి ఉండబోతున్నారు.
ఇక టీడీపీకి జనసేన మద్దతు ఉండడంతో గెలుపు సాధ్యమని అదితి గజపతిరాజు మద్దతుదారులు గట్టి నమ్మకంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో జనసేనకు ఇక్కడ ఏడు వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి గ్రాఫ్ పెరిగింది అని ఆ పార్టీ అంటోంది. అంటే పదివేలకు ఆ ఓట్లు పెరిగినా గతంలో టీడీపీ ఓడిన ఆరు వేల మెజారిటీని దాటి విజయం సాధించవచ్చు అన్నది పసుపు పార్టీ ధీమా. పైగా అశోక్ పట్ల సానుభూతి ఉందని ఆయనను మాన్సాస్ చైర్మన్ పదవి నుంచి అకారణంగా తొలగించారు అన్న చర్చ కూడా ఉంది.
అయితే కోలగట్ల కూడా సామాన్యుడు కారు. ఆయన ప్రతీ ఇంటినీ ఒకటికి రెండు సార్లు చుట్టేస్తున్నారు. పిలిచిన పలికే ఎమ్మెల్యేగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన సామాజిక వర్గం ఓట్లు కూడా విజయనగరంలో అధికంగా ఉన్నాయి. బీసీలు కూడా వైసీపీకి మద్దతు ఇస్తారు అని భావిస్తున్నారు. సంక్షేమ పధకాల ప్రభావంతో మళ్లీ బంపర్ విక్టరీ కొడతాను అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దీంతో విజయనగరం ఎమ్మెల్యే సీటుకు పోటా పోటీ తప్పదని అంటున్నారు. ఎవరు గెలిచినా కూడా మెజారిటీ స్వల్పమే అని కూడా అంటున్నారు. మరి రాజు గారి వారసురాలు పూసపాటి మూడవ తరం అసెంబ్లీకి వెళ్తుందా అంటే చూడాల్సిందే.