నిఘా బెలూన్ ఘటన... చైనా అంత చేసిందా?
కేవలం గాలుల కారణంగా అమెరికా గగనతలంలోకి వచ్చిందని, అలా రావడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ ఏడాది ఆరంభంలో అమెరికా గగనతలంలో చైనా గూఢచర్య బెలూన్ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. అది వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన "ఎయిర్ షిప్" అని చైనా మొదటి నుంచి ఒకటే మాట చెప్పుకొస్తుంది. కేవలం గాలుల కారణంగా అమెరికా గగనతలంలోకి వచ్చిందని, అలా రావడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సమయంలో ఇది పక్కా ప్లానింగ్ తో చేసిన పనిగా యూఎస్ నిర్ధారిస్తుంది!
అవును... చైనా నిఘా బెలూన్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా పొరపాటున యూఎస్ లోకి వెళ్లిందని చెబుతున్న చైనా బెలూన్.. అమెరికా ఇంటర్నెట్ నే ఉపయోగించుకుందని కథనాలొస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మీడియా సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. అయితే ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ పేరు మాత్రం వెల్లడికాలేదు! దీంతో అమెరికా అనుమానం ఈసారి పూర్తిగా నిజమైందని అంటున్నారు!
వాస్తవానికి అణు క్షిపణుల ప్రయోగ కేంద్రం ఉన్న మోంటానా అనేది అత్యంత రహస్యమైన ప్రాంతం అనేది తెలిసిన విషయమే. అయితే సరిగ్గా ఈ బెలూన్ ఆ ప్రాంతంలొనే కన్పించడంతో అమెరికా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. వెంటనే ఆ బెలూన్ ను కూల్చివేసి శకలాలను సేకరించింది. వాటిలో ప్రత్యేకమైన చైనీస్ సెన్సర్లు ఉన్నట్లు గుర్తించింది.
ఆ బెలూన్ లో అమర్చిన టెక్నాలజీతో అమెరికాలోని కీలక ప్రదేశాల ఫొటోలు, వీడియోలు మొదలైన సమాచారాన్ని సేకరించి బీజింగ్ కు బదిలీ చేయాలని ప్రయత్నించిందని అమెరికా వెల్లడించింది. చైనా చెబుతున్నట్లు ఇది వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ కాదని.. అగ్రరాజ్యంపై నిఘా పెట్టాలనే ఉద్దేశంతోనే దీన్ని పంపించారని అధికారులు తెలిపారు. దీంతో ఈ విషయంపై అగ్రరాజ్యం ఈ విషయంపై మరింత సీరియస్ అవుతుంది!
ఇదే సమయంలో... ఈ అమెరికా గగనతలాల మీదుగా సుమారు ఎనిమిది రోజుల పాటు ప్రయాణించిందని.. ఈ సమయంలో ఎలాంటి డేటాను చైనాకు బదిలీ చేసినట్లు ఆధారాలు లభించలేదని అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే... ప్రస్తుతం వస్తున్న ఇంటర్నెట్ వినియోగం వ్యవహారంపై అటు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ), ఆఫీస్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ కానీ.. ఇటు చైనా కానీ స్పందించకపోవడం గమనార్హం.
కాగా... చైనాకు చెందిన ఓ గూఢచర్య బెలూన్ ను తమ గగనతలంలో గుర్తించినట్లు అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నాడు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. చైనా పర్యటన రద్దయ్యింది. సుమారు మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్.. విమానాల కన్నా ఎత్తులో ప్రయాణిస్తోందని పెంటగాన్ వెల్లడించింది.