అంతిమ యాత్ర కోసం ఆ ఇద్దరు... వీడియో వైరల్!

మనిషి బ్రతికున్నంతకాలంలో కనీసం నలుగురిని సంపాదించుకోవాలని చెబుతుంటారు పెద్దలు.

Update: 2023-10-15 04:02 GMT

మనిషి బ్రతికున్నంతకాలంలో కనీసం నలుగురిని సంపాదించుకోవాలని చెబుతుంటారు పెద్దలు. చివరిలో పాడె మోయడానికి కనీసం నలుగురు ఉంటే చాలు.. ఈ మానవ జన్మ ముగిసిన అనంతరం శరీరం మట్టిలో కలిసిపోతుందని! అయితే డబ్బుంటే, పలుకుబడి ఉంటే... నలుగురేమిటి.? నలభై మంది, నాలుగొందలమంది, నాలుగువేల మంది వస్తారు.. చరిత్రలో ఎన్నో అలాంటి సంఘటనలు కనిపించాయి!

కానీ... పేదవాడికి ఆ నలుగురు కూడా ఉండరు. ఈ రోజుల్లో నలుగురు ఎందుకు ఒక్కరుండి వాహనంలో ఎక్కిస్తే సరిపోతుంది కదా అంటారా? ఆ వాహనానికైనా డబ్బులు ఉండాలిగా? ప్రభుత్వాలు ఉన్నాయి కదా...? ఉన్నాయి!! తాజాగా అనారోగ్యం వేధిస్తే వైద్యానికి డబ్బుల్లేక ఓ పేదరాలు అకాల మరణానికి గురైతే జరిగిన ఒక హృదయవిధార ఘటన ఇప్పుడు ఇన్ని ప్రశ్నలకు కారణమైంది.

అవును... అనారోగ్యం వేధిస్తే వైద్యానికి డబ్బుల్లేక ఓ పేదరాలు అకాల మరణానికి గురైంది. ఇప్పటికీ అలాంటి పరిస్థితితులు ఉన్నాయా అంటే... చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ వైద్యం చాలా పిరం! దీంతో ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లేందుకూ స్తోమత చాలక ముందు భర్త.. వెనుక తండ్రి కర్రకు డోలీ కట్టి మోశారు. యూపీలో లోని ప్రయాగ్‌ రాజ్‌ జిల్లాలో ఈ హృదయవిదారక ఘటన వెలుగు చూసింది.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌ రాజ్‌ లోని సంగమనగరిలో రోడ్డు పక్కన వేసుకున్న ఒక చిన్న గుడారంలో ఈ సంచార కుటుంబం నివసిస్తోంది. అందులోని నఖ్రు అనే వ్యక్తి భార్య అనిత (26) చనిపోయింది. ఆ సమయానికి వారి వద్ద ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి! దీంతో... డోలీలో మృతదేహాన్ని మోస్తూ దారాగంజ్‌ శ్మశానవాటికకు బయలుదేరారు. అనిత భర్త, తండ్రి!

ఇలా ఇద్దరే చివరి మజిలీకి తీసుకెళ్తున్న సమయంలో... వారి వెనుక రోదిస్తూ అనిత తల్లి వారిని అనుసరించింది. ఇలా సుమారు 5 కి.మీ.లు నడిచాక ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో స్థానిక ఎస్‌ఐ నవీన్‌ సింగ్‌ సమక్షంలో స్థానికులు విరాళాలు పోగు చేశారు. అనంతరం ఆ మృతదేహం తరలింపునకు ఈ-రిక్షా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Tags:    

Similar News