పవన్ చాలా లైట్ తీసుకున్నారా ?
దీపావళి పండుగ తర్వాత నుండి పవన్ ప్రచారం చేయబోతున్నట్లు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణా ఎన్నికలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా లైటుగా తీసుకున్నట్లున్నారు. అభ్యర్ధులు గెలిచినా, ఓడినా తనకు సంబంధంలేదన్నట్లుగానే పవన్ వ్యవహరిస్తున్నారు. పవన్ వైఖరి కారణంగా మిత్రపక్షం బీజేపీ నేతలు కూడా మండిపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్నికల్లో బీజేపీ పొత్తులో జనసేన ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీచేస్తోంది. పొత్తు ధర్మంలో భాగంగా రెండుపార్టీల అభ్యర్దుల తరపున పవన్ ప్రచారం చేయాలి. దీపావళి పండుగ తర్వాత నుండి పవన్ ప్రచారం చేయబోతున్నట్లు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.
సీన్ కట్ చేస్తే పవన్ అడ్రస్ ఎక్కడా ఎవరికీ దొరకటంలేదు. బీజేపీ అభ్యర్ధులకు పవన్ ప్రచారం సంగతి పక్కనపెట్టేస్తే అసలు జనసేన అభ్యర్ధులకు కూడా పవన్ ప్రచారం చేయలేదు. మరో వారంరోజుల్లో ప్రచారం ముగుస్తోంది. అయినా ఇంతవరకు పవన్ ప్రచారంలోకి దిగకపోవటానికి కారణం ఏమిటో కూడా తెలీటంలేదు. పవన్ ప్రచారాన్ని నమ్ముకునే ఎనిమిది మంది పోటీలో నిలబడ్డారు. 25వ తేదీన తాండూరులో తనకు అత్యంత సన్నిహితుడైన అభ్యర్ధి శంకర్ గౌడ్ తరపున, 26న కూకట్ పల్లిలో ముమ్మారు ప్రేమ్ కుమార్ తరపున ప్రచారం చేసే అవకాశాలున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
పోటీచేస్తున్న ఇద్దరికి మద్దతుగా పవన్ ప్రచారం చేస్తే మరి మిగిలిన ఆరుమంది అభ్యర్ధుల సంగతి ఏమిటి ? ప్రచారం చేసే విషయంలో అసలు పవన్ మనసులో ఏముందో కూడా ఎవరికీ తెలీటంలేదు. మొన్నటి ఆదివారం నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్డుషో జరిగింది. మల్కాజ్ గిరి రోడ్డుషోలో నడ్డాతో పాటు పవన్ కూడా పాల్గొనాల్సుంది.
అయితే రోడ్డుషోలో నడ్డా పాల్గొన్నారు ప్రచారంచేసి వెళ్ళిపోయారు. పవన్ మాత్రం అడ్రస్ లేరు. దాంతో బీజేపీ సీనియర్లంతా మండిపోతున్నారు. ఎన్నికలను సీరియస్ గా తీసుకోకపోవటం, అభ్యర్ధుల తరపున ప్రచారం చేసే ఉద్దేశ్యం లేనపుడు అసలు తమతో ఎందుకు పొత్తుపెట్టుకున్నారని బీజేపీ నేతల్లో చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయటం ద్వారా జనసేన అభ్యర్ధుల్లోనే కాదు బీజేపీలో కూడా పవన్ అయోమయం పెంచేశారన్నది వాస్తవం.