ప్రాణప్రతిష్ఠ వేళ సెలవుపై కర్ణాటక డిప్యూటీ సీఎం మాటలు విన్నారా?
అయితే.. ఈ డిమాండ్ ను బీజేపీ.. దాని అనుబంధ వర్గాలు చేస్తున్నట్లుగా కౌంటర్లు ఇస్తున్నారు.
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ రోజు (సోమవారం, జనవరి 22) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహాద్భుత ఘట్టం కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది. కోట్లాది మంది శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరామచంద్రుడి జన్మస్థలిలో నిర్మితమైన అయోధ్య రామమందిరంలోని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై బోలెడంత రాజకీయం నెలకొన్న సంగతి తెలిసిందే. అన్నింటికి మించి.. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న వేళ.. సెలవు దినంగా ప్రకటించాలన్న డిమాండ్ కర్ణాటకలో ఎక్కువగా వినిపిస్తోంది.
అయితే.. ఈ డిమాండ్ ను బీజేపీ.. దాని అనుబంధ వర్గాలు చేస్తున్నట్లుగా కౌంటర్లు ఇస్తున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ సెలవు ఇవ్వాలన్న డిమాండ్ పై తాజాగా కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ప్రాణప్రతిష్ఠ వేళ సెలవు ఇవ్వాలన్న సలహాను తమకు ఎవరూ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేరులో రాముడు (సిద్ధరామయ్య).. తన పేరులో శివుడు (డీకే శివకుమార్) ఉన్నారని.. దీని వల్ల తామేం చేయాలో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తమపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
‘మతం ఉండి తీరాలు. అందులో రాజకీయం మాత్రం ఉండొద్దు. భక్తి.. మతం తదితర వాటి గురించి మేం ప్రచారాన్ని ఆశించం. ఇతరులు తమకు చెప్పే ముందు మేం ఇప్పటికే తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకోవాలి. మాకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. దేవస్థానాల్లో పూజలు ఎలా చేస్తారన్నది అక్కడి పూజారులు కలిసి తీర్మానిస్తారు’’ అంటూ వ్యాఖ్యానించారు. నిజమే.. అయోధ్యలో రాములోరి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న వేళలో.. సెలవు ఇస్తేనే భక్తి ఉన్నట్లు కాదన్న విషయాన్ని బీజేపీ అండ్ కో గుర్తించాల్సిన అవసరం ఉంది.
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో సెలవు ఇవ్వాలన్న డిమాండ్ పై మరింతగా స్పందించిన డీకే మరో కీలక వ్యాఖ్య చేశారు. పూజలు.. ప్రార్థనలతో ఫలితం ఉంటుందని నమ్మే వారిలో తాను కూడా ఉన్నట్లు చెప్పారు. సమాజం బాగుండాలని అంతా కలిసి పూజలు.. ప్రార్థనలు చేయాలన్న సూచన ఆయన చేశారు. మొత్తంగా చూస్తే.. ప్రాణప్రతిష్ఠ వేళ సెలవు ఇవ్వాలన్న దానికి డీకే సరైన కౌంటర్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.