వీడియో... ఆపరేషన్ థియేటర్ లో అవేంపనులు డాక్టర్ జీ!
ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రీవెడ్డింగ్ షూట్లు, వాటికోసం చేస్తున్న పనులు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే
ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రీవెడ్డింగ్ షూట్లు, వాటికోసం చేస్తున్న పనులు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ యూనీఫాం లతోనూ, ఆర్టీసీ బస్సులలోనూ ఫోటో షూట్ లు చేసుకుని కొంతమంది పై అధికారులతో ఇబ్బందులు పడగా... మరికొంతమంది కొండలెక్కి, లోయల్లోకి దిగి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు కూడా! అవన్నీ ఒకెత్తు అన్నట్లుగా... తాజాగా ఆపరేషన్ థియేటర్ లో ప్రీవెడ్డింగ్ షూట్ ప్లాన్ చేశాడు ఒక వైద్యుడు! దీంతో అసలుకే ఎసరు వచ్చింది!!
అవును... ఓ వైద్యుడు తన వృత్తిధర్మాన్ని మరచి ఏకంగా ఆసుపత్రిలోనే ప్రీవెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేశాడు. అదో గొప్ప అనుకున్నాడో.. లేక, ఇంకా ఏమైనా అనుకున్నాడో ఏమో కానీ... ఆపరేషన్ చేస్తున్నట్లుగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసే పనికి పూనుకున్నాడు. దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందింది. ఫలితంగా... ఆ వైద్యుడిని తక్షణమే విధుల్లోంచి తొలగించింది. మరోపక్క ఈ ఫొటోషూట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
వివరాళ్లోకి వెళ్తే... కర్ణాటకలోని భరంసాగర్ ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యుడిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆపరేషన్ థియేటర్ నే తన ప్రీవెడ్డింగ్ షూట్ వేదికగా ఫిక్సయ్యాడు! ఈ సమయంలో తనకు కాబోయే భార్యతో కలిసి ఓ రోగికి ఆపరేషన్ చేస్తున్నట్లుగా ఫొటోలు, వీడియోలు తీయించుకున్నాడు. దీంతో ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మరోపక్క అటు వైద్యవర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
దీంతో కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండు రావ్... ట్విటర్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... ఆసుపత్రిలో ప్రీవెడ్డింగ్ షూట్ నిర్వహించిన సదరు వైద్యుడిని తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో... ప్రభుత్వ ఆసుపత్రులను నెలకొల్పింది ప్రజలకు వైద్యాన్ని అందించడానికి మాత్రమే అని.. వాటిని వ్యక్తిగత అవసరాలకు వాడటానికి కాదని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.