భార్యాబిడ్డలను హతమార్చి, ఉరేసుకున్న వైద్యుడు.. విజయవాడలో ఘోరానికి కారణం ఇదే!?
ఈ సమయంలో... సొంతంగా ఆసుపత్రిని ప్రారంభించే ప్రయత్నాల్లో అప్పులపాలు కావడంతో శ్రీనివాస్ ఒక ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు
విజయవాడ నగరం పటమటలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా తీవ్ర సంచలనంగా మారిన ఈ ఘటన విషయానికొస్తే... విజయవాడ పటమట వాసవీనగర్ కు చెందిన ఎముకల వైద్యుడు ధరావత్ శ్రీనివాస్ (40).. భార్య ఉష (38), కుమార్తె శైలజ (9), కుమారుడు శ్రీహన్ (5), తల్లి రమణమ్మ (65)తో పాటు ఉంటున్నారు.
ఈ సమయంలో... సొంతంగా ఆసుపత్రిని ప్రారంభించే ప్రయత్నాల్లో అప్పులపాలు కావడంతో శ్రీనివాస్ ఒక ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన అతడు దారుణమైన ఆలోచన చేశాడు. ఇందులో భాగంగా.. భార్య, ఇద్దరు పిల్లలను, కన్నతల్లిని కడతేర్చి తానూ ఉరివేసుకుని తనువు చాలించారు.
అవును... వైద్యుడైన శ్రీనివాస్ సొంతంగా ఆసుపత్రి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం గత ఏడాది ఓ భవనాన్ని లీజుకు తీసుకున్నారు. ఈ క్రమంలో... దానికోసం సుమారు రూ.3 కోట్ల మేర వెచ్చించారు. అయినప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో అది వినియోగంలోకి రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన స్నేహితులు కొందరు భాగస్థులుగా చేరి, శ్రీనివాస్ ను మోసగించి రోడ్డున పడేశారని బంధువులు చెబుతున్నారు.
ఇలా ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు నమ్మిన స్నేహితులు చేసిన మోసంతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీనివాస్... వారు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక రెండు నెలలుగా తీవ్ర కుంగుబాటులో ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలోనే... ఇంట్లో అందరినీ చంపి, తాను కూడా ప్రాణం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో... సోమవారం అర్ధరాత్రి దాటాక.. శ్రీనివాస్ వేర్వేరు గదుల్లో నిద్రపోతున్న తల్లి, భార్య, పిల్లలను చాకుతో మెడ భాగంలో కోసేశారట. దీంతో... కొద్దిసేపట్లోనే వారంతా చనిపోయారు. అనంతరం మంగళవారం ఉదయం 6:30 గంటల సమయంలో.. ఇంట్లో డబ్బులు, బంగారం ఓ బ్యాగులో సర్ది, దానిని తన కారులో ఉంచారు.
ఈ సమయంలో... కారు లాక్ చేసి, ఆ కారు తాళానికి కాగితం చుట్టి ఎదురింటి గేటుకు ఉన్న పెట్టెలో వేశారు. తాను ఊరు వెళ్తున్నానని.. అన్నయ్య వస్తే కారు తాళం ఇవ్వమని ఆ ఇంటివారికి చెప్పి తన ఇంట్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో... ఉదయం 9:30 గంటలకు పనిమనిషి వచ్చి చూడగా పోర్టికోలో శ్రీనివాస్ ఉరేసుకుని కనిపించారు.
ఈ సమయంలో విషయం తెలుసుకున్న స్థానికులు ఎదురింటివారి గేటుకున్న బాక్స్ లో వేసిన కారు తాళానికి చుట్టిన కాగితం తీసి చూడగా.. తన సోదరుడైన న్యాయాధికారి దుర్గప్రసాద్ కు మాత్రమే ఇవ్వమని, ఆయన ఫోన్ నంబరు రాసి ఉంది. దీంతో... వారు ఆయనకు ఫోన్ చేసి తెలపగా, ఆయన పోలీసులకు సమాచారం అందజేశారు.
అదే విధంగా... శ్రీనివాస్ తన ఫోన్ లో వాయిస్ ను రికార్డ్ చేసి ఉంచారు. అందులో... కారులో ఉంచిన నగదు, నగలను తన అన్న దుర్గాప్రసాద్ కు ఇవ్వమని ఉంది. ఇదే క్రమంలో... ఆర్థిక ఇబ్బందులతోనే తాను చనిపోతున్నట్లు కూడా రికార్డ్ చేశారు. దీంతో పోలీసులు కారులో ఉన్న సొత్తును చూడగా.. అందులో రూ. 16 లక్షల నగదు, 300 గ్రాముల బంగారం ఉన్నట్లు తేలింది.