ఐపీఎస్ పై చ‌ర్య‌లు: ఎందుకీ తొంద‌ర‌.. బాబుకు తెలిసే చేశారా?

వారి తొంద‌ర‌, చంద్ర‌బాబుపై ఉన్న ప్రేమ‌, ఆయ‌న‌ను మ‌చ్చిక చేసుకోవాల‌న్న ల‌క్ష్యం ఎలా ఉన్నా.. రేపు కోర్టుల ముందు.. కూట‌మి స‌ర్కారుకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Update: 2024-10-09 04:01 GMT

ఏపీలో మారుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. `ఎందుకీ తొంద‌ర‌?` అనే ప్ర‌శ్న‌లే వ‌స్త‌న్నాయి. ఆయా అంశాల‌ను నిశితంగానే కాదు.. పైపైనే స‌మీక్షించినా.. రేపు ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న సంకేతాలు కూడా వ‌స్తున్నాయి. మ‌రి ఇవి సీఎం చంద్ర‌బాబుకు తెలిసే జ‌రుగుతున్నాయా? లేక‌.. ఆయ‌న‌పై ఉన్న భ‌క్తితో గ‌తంలో కొంద‌రు అధికారులు వ్య‌వ‌హ‌రించిన‌ట్టుగా ఇప్పుడు కూడా ఉన్న‌తాధికారులు అదే మార్గంలో ప‌య‌నిస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వారి తొంద‌ర‌, చంద్ర‌బాబుపై ఉన్న ప్రేమ‌, ఆయ‌న‌ను మ‌చ్చిక చేసుకోవాల‌న్న ల‌క్ష్యం ఎలా ఉన్నా.. రేపు కోర్టుల ముందు.. కూట‌మి స‌ర్కారుకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఏం జ‌రిగింది?

వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ అప్ప‌టి ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ చేశారంటూ.. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అప్ప‌టి సీఐడీ చీఫ్ ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌కుస‌ర్కారు సోమ‌వారం నోటీ సులు ఇచ్చింది. ``ర‌ఘురామ కేసులో మీరు సోష‌ల్ మీడియాలో అనుచితంగా వ్యాఖ్య‌లు చేశారు. కాబ‌ట్టి.. ఇవి స‌ర్వీసు రూల్స్‌కు విరుద్ధం. సో.. అలాంటి వ్యాఖ్య‌లు చేసినందుకు.. వివ‌ర‌ణ ఇవ్వండి`` అని నోటీసుల్లో పేర్కొంది. దీనికి గాను 15 రోజుల స‌మ‌యం ఇస్తున్న‌ట్టు కూడా స‌ర్కారు పేర్కొంది. కానీ, ఇంతలోనే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. నోటీసులు ఇచ్చి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే. .. సునీల్‌ను స‌స్పెండ్ చేశారు.

డిజి ర్యాంక్ హోదాలో ఉన్న‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్ పై ప్రభుత్వం వేటు వేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనలు 1969 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినందుకు... క్రమశిక్షణా చర్యలను తీసుకొన్న ప్రభుత్వం జీవో ఆర్‌టి నెం 1695 జారీజేసింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ వెబ్‌సైట్ లో ఈ ఉత్తర్వులను Confidential కింద అప్‌లోడ్ చేశారు.. అయితే.. వాస్త‌వాని నోటీసులు ఇచ్చి 15 రోజుల గ‌డువు ఇచ్చి.. ఇప్పుడు అనూహ్యంగా ఆయ‌న‌పై వేటు వేయ‌డం గ‌మ‌నార్హం. ఇది రేపు న్యాయ‌స్థానంలో ప్ర‌బుత్వానికి ఇబ్బందేన‌ని అంటున్నారు సీనియ‌ర్ అదికారులు.

ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న చంద్ర‌బాబుకు అస‌లు ఈ విష‌యం తెలుసా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. పైగా.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన సునీల్‌ను వేధిస్తున్నారంటూ.. ఇప్ప‌టికే ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఐపీఎస్‌,ఐఏఎస్‌లు కూడా గుస‌గుస‌లాడుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా తీసుకున్న నిర్ణ‌యాలు రేపు స‌ర్కారుకు ఇబ్బందులు తేవ‌డం ఖాయ‌మ‌ని..ఇలాంటి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన అధికారుల వ‌ల్ల గ‌త వైసీపీ ప్ర‌భుత్వం కూడా ఇబ్బందులు ప‌డిన విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

Tags:    

Similar News