పాలిటిక్స్ లో వ్యూహాలకు, ప్రాక్టికల్స్ కు తేడా పీకేకు తెలిసిందా?
ఈ క్రమంలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ వివిధ ప్రాంతాలకు పోలీసు వాహనంలో కూర్చోబెట్టి తీసుకెళ్లారని అన్నారు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ కిశోర్... ప్రధానంగా ఏపీలో 2019లో వైసీపీ అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించినట్లు చెబుతుంటారు. అంతక ముందు బీజేపీకి సహకరించారని అంటారు. ఆ విధంగా వ్యూహకర్తగా పీకే సక్సెస్ అయ్యారనే అంటారు. ఈ సమయంలో ఆయన నేరుగా పొలిటీషియన్ గా మారారు.
ఇందులో భాగంగా... జన్ సురాజ్ పార్టీని స్థాపించారు. ఇటీవల బీహార్ లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసినా.. చూపించిన ప్రభావం అతి స్వల్పం అనే మాటలు వినిపించాయి. ఇలా పొలిటికల్ ప్రాక్టికల్స్ లో డక్కా మొక్కీలు తింటున్నట్లు కనిపిస్తున్న పీకే తాజాగా పోలీసుల అరెస్టు, వివరం చెప్పకుండా వివిధ ప్రాంతాలకు తిప్పడం వంటి విషయాలను ఎక్స్ పీరియన్స్ చేసినట్లు తెలుస్తోంది.
అవును... బీహార్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (బీ.పీ.ఎస్.సీ.) వ్యవహారంలో ప్రశాంత్ కిశోర్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు సోమవారం భగ్నం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని హెచ్చరిస్తూ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
అయితే... ఈ షరతులతో కూడిన బెయిల్ ను పీకే తిరస్కరించారు. దీంతో.. ఆయనను సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఈసారి షరతులు లేని బెయిల్ మంజూరు చేసింది. దీంతో.. సోమవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు ప్రశాంత్ కిశోర్. ఈ సందర్భంగా స్పందించిన ప్రశాంత్ కిశోర్... పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.
ఇందులో భాగంగా... తన దీక్షను భగ్నం చేసిన అనంతరం తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం చెప్పలేదని.. ఈ క్రమంలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ వివిధ ప్రాంతాలకు పోలీసు వాహనంలో కూర్చోబెట్టి తీసుకెళ్లారని అన్నారు. ఇదే సమయంలో.. తనను జైలుకు కూడా తీసుకెళ్లలేదని పీకే సంచలన ఆరోపణలు చేశారు.
దీంతో... ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన తర్వాత, ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎదురయ్యే బాధలు, ఇబ్బందులు వాటి నుంచి ఎలా తేరుకుని ప్రజల్లో పేరు సంపాదించుకోవాలి అనే విషయాలపై ఇప్పటివరకూ పలువురు నేతలకు మెలుకువలు చెప్పిన పికేకీ.. తాజాగా ఈ ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ కూడా లభించినట్లుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా... ఇటీవల బీ.పీ.ఎస్.సీ నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 2న గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ప్రశాంత్ కిశోర్. దీంతో... సోమవారం ఆయన దీక్ష భగ్నం చేశారు పోలీసులు.
ఈ క్రమంలో... సుమారు నాలుగు రోజుల పాటు నిరాహర దీక్ష చేయడంతో పాటు సోమవారం పగలంతా పోలీసుల అదుపులోనే ఉండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందని చెబుతున్నారు. దీంతో.. ఆయనను పాట్నాలోని ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది.