సజ్జల టీం ప్లానింగ్ తోనే నందిగం సురేష్ అరెస్టు?

నందిగం సురేష్ ను అరెస్టు చేయటం అనవసరమన్న డొక్కా.. ముందు సజ్జలను అరెస్టు చేయటం అవసరమని మండిపడ్డారు.

Update: 2024-09-06 04:56 GMT

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల మాజీ వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు అయిన ఉదంతంపై మాజీ మంత్రి మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అరెస్టు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి టీం ప్లానింగ్ ఉందంటూ ఆరోపించారు. సజ్జల టీం ఇచ్చిన సమాచారంతోనే నందిగం సురేష్ అరెస్టు అయ్యారని.. ఒక దళితుడు అరెస్టు అయితే పార్టీకి సానుభూతి వస్తుందన్న ఉద్దేశంతోనే ఇలా జరిగిందన్నారు.

నందిగం సురేష్ ను అరెస్టు చేయటం అనవసరమన్న డొక్కా.. ముందు సజ్జలను అరెస్టు చేయటం అవసరమని మండిపడ్డారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ హెడ్డాఫీసుపై దాడికి సూత్రధారి సజ్జలగా పేర్కొన్నారు. అయితే.. ఈ కేసులో ఒక ఎస్సీని అరెస్టు చేయిస్తే పార్టీకి సానుభూతి వస్తుందన్న కుట్రలో భాగంగానే నందిగం సురేష్ ఆచూకీని పోలీసులకు తెలియజేశారన్నారు.

అందుకే.. నందిగం సురేష్ అరెస్టు అయ్యారన్న డొక్కా.. పార్టీ ఆఫీసుపై దాడి ఘటనలో గుంటూరు.. విజయవాడకు చెందిన వైసీపీ నేతల్ని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అయితే.. ఈ కేసులో ప్రధాన నిందితులంతా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. నందిగం సురేష్ సైతం వెళ్లిపోయినప్పటికీ.. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. అయితే.. ఈ అరెస్టు వెనుక సజ్జల మాస్టర్ ప్లానింగ్ ఉందంటూ డొక్కా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

పార్టీ పదవులు.. ఎమ్మెల్యే.. ఎంపీ సీట్ల ఆశ చూపించి టీడీపీ ఆఫీసు మీద దాడికి ప్లాన్ చేశారన్నారు. ‘‘ముందు సజ్జలను అరెస్టు చేయిస్తే ఇలాంటివన్నీ ఆగిపోతాయి. విజయవాడ వరదలకు ప్రక్రతి ప్రకోపంతో పాటు వైసీపీ నేత ల ఆక్రమణలు.. మట్టి తవ్వకాలు మరో ప్రధాన కారణం. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు అలుపెరగని ధీరుడిగా పని చేస్తున్నారు’’ అంటూ పొగిడేశారు.

Tags:    

Similar News