‘ఏప్రిల్ 2 విడుదల..’ భారత్, చైనాపై ట్రంప్ టారిఫ్ కొరడా

ఎన్నాళ్లుగానో మిత్ర దేశాలుగా ఉన్న యూరప్ దేశాలనూ వదల్లేదు.. శత్రువుగా చూసే చైనానూ ఉపేక్షించలేదు.. ఇక మిగిలింది భారత్;

Update: 2025-03-05 08:30 GMT

అధ్యక్షుడు అయిన దగ్గరనుంచి టారిఫ్ ల కొరడా పట్టుకుని తిరుగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ దేశం మీద విరుచుకుపడతారో తెలియని పరిస్థితి..

ఎన్నాళ్లుగానో మిత్ర దేశాలుగా ఉన్న యూరప్ దేశాలనూ వదల్లేదు.. శత్రువుగా చూసే చైనానూ ఉపేక్షించలేదు.. ఇక మిగిలింది భారత్.. వాస్తవానికి ట్రంప్ మన మీద టారిఫ్ లు విధిస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ, అన్నంత పనీ చేశారు.

అధ్యక్షుడు అయినాక తొలిసారి అమెరికన్ కాంగ్రెస్ (సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్) సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. భారత్‌, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్‌ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని బాంబు పేల్చారు.

జనవరి 20 నుంచి గడిచిన ఆరు వారాల్లో తాను చేసిన పనులు, సాధించిన విజయాలను చెప్పుకొంటూ వచ్చిన ట్రంప్.. గత నాలుగేళ్లు, ఎనిమిదేళ్లలో సాధించిన దాని కంటే ఈ 43 రోజుల్లోనే ఎక్కువ సాధించినట్లు తెలిపారు. ఇది కేవలం ఆరంభమేనని అన్నారు.

కొన్ని దేశాలు దశాబ్దాలుగా అమెరికాపై టారిఫ్‌ లు విధిస్తున్నాయని.. ఇప్పుడు తమ సమయం వచ్చిందని.. అన్నారు. సగటు లెక్కలు తీస్తూ.. భారత్‌ నూ యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్‌ సరసన చేర్చారు. చాలా దేశాలు అమెరికా నుంచి అధికంగా వసూలు చేస్తున్నాయన్నారు.

భారత్‌ తమపై 100 శాతానికి పైగా ఆటో టారిఫ్‌ లు విధించిందని ట్రంప్ మండిపడ్డారు. ప్రస్తుత వ్యవస్థలపై అమెరికాకు న్యాయం జరగలేదని.. అందుకే, ఏప్రిల్‌ 2 నుంచి ప్రతీకార సుంకాలు విధిస్తామని ప్రకటించు.

ఎంత విధిస్తే అంత..

తమపై ఎంత టారిఫ్ విధిస్తే తామూ అంతే వసూలు చేస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు. దీంతో అమెరికా మరింత సంపన్నం అవుతోందని అన్నారు. మళ్లీ గొప్ప దేశంగా అవతరిస్తుందన్నారు.

కొసమెరుపు: టారిఫ్ లను ఏప్రిల్‌ 1 నుంచే అమలు చేయాలని భావించినా.. ఏప్రిల్‌ ఫూల్‌ అనే మీమ్స్‌ బారిన పడలేక ఏప్రిల్ 2ను ఎంచుకున్నట్లు ట్రంప్ తెలిపారు.

Tags:    

Similar News