ట్రంప్ ర్యాలీలో మరో కలకలం.. మూడో హత్యాయత్నం?

ట్రంప్ ర్యాలీ సమీపంలో ఓ వ్యక్తి గన్ లతో సంచరించడం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-10-14 05:05 GMT

మరో కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు పీక్స్ కి చేరుతున్నాయి. వెలువడుతున్న ఒపినియన్ పోల్స్ కూడా ఏమాత్రం స్పష్టత లేకుండా.. నువ్వా - నేనా అనే ఫలితాలనే ఇస్తున్నాయి. అయితే... ట్రంప్ ర్యాలీ సమీపంలో ఓ వ్యక్తి గన్ లతో సంచరించడం హాట్ టాపిక్ గా మారింది.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అన్ని విషయాలు ఒకెత్తు.. ట్రంప్ పై హత్యాయత్నం విషయం మరొకెత్తు అన్నట్లుగా పరిస్థితి మారిన సంగతి తెలిసిందే! ఇప్పటికే రెండు సార్లు ట్రంప్ పై హత్యాయత్నం జరిగిందని చెబుతున్నారు. ఇందులో మొదటిసారి హత్యాయత్నం చేసిన వ్యక్తిని స్పాట్ లోనే కాల్చి చంపగా.. రెండోసారి ప్రయాత్నించినట్లు చెబుతున్న వ్యక్తి ఇప్పుడు జైలులో ఉన్నారు.

ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి గన్ లతో సంచరించడం మరోసారి కలకలం రేపింది. కాలిఫోర్నియాలోని కోచెల్లాలో నిర్వహించిన డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ సందర్భంగా.. ఆ ర్యాలీకి సమీపంలో ఓ వ్యక్తి రెండు గన్ లతో సంచరించాడని ట్రంప్ రక్షణ సహాయకుల టీం.. తెలిపింది.

ఈ విషయాన్ని గ్రహించిన ట్రంప్ రక్షణ సహాయకుల బృందం షెరీఫ్... అక్రమ షాట్ గన్, లోడ్ చేసిన గన్ ని స్వాధీనం చేసుకొని.. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు! ఈ విషయంపై తమకు సమాచారం అందిందని.. దీంతో తాము వెంటనే అప్రమత్తమయ్యామని తెలిపారు. ఈ నేపథ్యంలో.. ట్రంప్ పై ఇది మూడో హత్యాయత్నంగా అధికారులు అనుమానిస్తున్నారు.

ఇదే సమయంలో... ఈ వ్యక్తివల్ల ట్రంప్ కు కానీ, ర్యాలీకి హాజరైన వారికి గానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. సదరు వ్యక్తిని లాస్ వెగాస్ కు చెందిన వెమ్ మిల్లర్ గా పోలీసులు గుర్తించారని అంటున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించే ఫేడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) తెలిపింది.

కాగా... ఈ ఏడాది జూలైలో పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ చెవికి తగులుతూ బుల్లెట్ పక్కకు దూసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో... సెప్టెంబరులో ఫ్లోరియాడ్లోని ట్రంప్ కు చెందిన గోల్ఫ్ కోర్సు దగ్గర ఆయనను హత్య చేయడానికి వచ్చినట్లు గుర్తించి ర్యాన్ వెస్లీ రౌత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు!

Tags:    

Similar News