ట్రంప్ వర్సెస్ కమలా.. సర్వేల్లో టఫ్ ఫైట్.. రిజల్ట్ ఇదే..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో అగ్రదేశం ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో అగ్రదేశం ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్షురాలిగా ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలో నిలిచారు. అలాగే.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పోటీలో ఉన్నారు.
ముందుగా డెమోక్రటిక్ పార్టీ తరఫున మరోసారి ప్రస్తుత అధ్యక్షుడు బైడెనే పోటీలో నిలుస్తారని అంతా అనుకున్నారు. అందుకు తగినట్లుగానే ఆయన ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఆ సమయంలో ట్రంప్ విజయం ఇక సునాయసనమనే అభిప్రాయం చాలా వరకూ కనిపించింది. బైడెన్ పాలనపై అక్కడి ప్రజలు అంతగా సంతృప్తికరంగా లేకపోవడం.. ట్రంప్ దూకుడుకు ఆకర్షితులు కావడంతో మరోసారి ట్రంప్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరిగింది. అధ్యక్ష రేసులో నుంచి జో బైడెన్ వైదొలగకముందు ట్రంప్, బైడెన్ల మధ్య తొలి డిబేట్ సైతం జరిగింది.
అయితే.. ఆ తరువాత అనూహ్యంగా బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. దాంతో డెమోక్రటిక్ పార్టీ కమలా హారిస్‌ను ప్రెసిడెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. దాంతో ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. అప్పటివరకు వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉన్న అమెరికా పాలిటిక్స్.. కమలా అభ్యర్థిత్వంతో తీవ్ర పోటీకి దారితీశాయని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. అనూహ్యంగా కమలా హారిస్ తెరమీదకు రావడంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పాయి. ఎప్పుడైతే ఆమె పోటీలోకి వచ్చారో అప్పటి నుంచి గణాంకాలు అన్నీ మారిపోయాయని సర్వేలు తెలిపాయి.
ఈ క్రమంలోనే ఇటీవల ట్రంప్, కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్సిస్టిట్యూషన్ సెంటర్ వేదికగా ఏబీసీ ఈ ముఖాముఖి నిర్వహించింది. ఇందులో ఇద్దరి మధ్య వాడివేడిగా డిబేట్ సాగింది. పరస్పర విమర్శలు దాడి కనిపించింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీటెక్కించారు. ఈ డిబేట్‌లో ట్రంప్‌కు కమలా దీటుగా బదులిచ్చారని.. ఆమెనే పైచేయి సాధించారని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. డిబేట్‌లో కమలా చాలా స్ట్రాంగ్‌గా కనిపించారని, ఆమెలో దూరదృష్టి కనిపించిందని అమెరికా మీడియా తెలిపింది.
ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న అగ్రదేశం అమెరికా ఎన్నికలపై అంతటా తీవ్ర ఉత్కంఠనే కనిపిస్తోంది. అటు పోటాపోటీ సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. అయితే.. తొలి డిబేట్‌పై సీఎన్ఎన్/ఎస్ఎస్ఆర్ఎస్ చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సర్వేలో 600 మంది పాల్గొనగా.. 63 శాతం మంది కమలా హారిస్ పెర్మార్ఫెన్స్ బాగుందని చెప్పారట. 37శాతం మంది మాత్రమే ట్రంప్ వైపు మొగ్గు చూపినట్లు తెలిపింది. అయితే.. ఇది ఓట్ల రూపంలో రిజల్ట్ వస్తుందా లేదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
ఇదిలా ఉండదా.. ట్రంప్‌కు మొదటి నుంచి ఆయనకు వస్తున్న 44 శాతం మద్దతులో ఎలాంటి మార్పు లేదనేది స్పష్టంగా కనిపిస్తున్నట్లు సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా అధ్యక్ష బరిలో నిలిచిన రాబర్ట్ ఎఫ్.కెన్నడీ పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ ట్రంప్ మద్దతుదారుల శాతంలో మార్పు కనిపించలేదు. అలాగే.. చికాగోలో డెమోక్రాటిక్ పార్టీ నాలుగు రోజులపాటు సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల తదుపరి హారిస్‌కు మద్దతు 47 శాతానికి చేరుకుంది. ఆమె అధ్యక్ష అభ్యర్థి హోదాలో అమెరికన్లను ఉద్దేశించి ఇచ్చిన ప్రసంగం తర్వాత మద్దతు పెరగడం మొదలైంది.
సర్వే రిపోర్టులు ఎలా ఉన్నా.. అమెరికా అధ్యక్షుడిని నిర్ణయించే కొన్ని కీలక రాష్ట్రాలు ఉన్నాయి. పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్ రాష్ట్రాలు ఒకప్పుడు డెమోక్రాట్లకు కంచుకోటగా ఉండేవి. కానీ.. 2016 ఎన్నికల వేళ అనూహ్యంగా ఆ రాష్ట్రాలు ట్రంప్‌కు మద్దతు తెలిపాయి. ఇక.. 2020లో జో బైడెన్ మరోసారి ఆ రాష్ట్రాలపై పట్టు సాధించారు. అయితే.. ఇప్పుడు కమలా కూడా ఆ రాష్ట్రాలపై అదే పట్టును కొనసాగిస్తే ఆమెకు విజయావకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్ ప్రకారం.. ఇద్దరి మధ్య కేవలం ఒక్కశాతం తేడా మాత్రమే కనిపిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
చివరగా.. సర్వేలు చెబుతున్నట్లు ఈ లెక్కలను నమ్మాలా..? వాస్తవాలు సర్వేలకు దగ్గరగా ఉంటాయా..? అనేది కూడా ఇప్పుడు అక్కడి ఓటర్లలో మెదులుతున్న ప్రశ్న. కేవలం ఒకటి రెండు శాతంతోనే ఇద్దరి మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో సర్వేలను ఏ మేరకు నమ్మొచ్చనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.