సీఎం రేవంత్ ను కలిసి మాజీ డీఎస్పీ నళిని అడిగిందేంటి?

ఒకసారి అధికారం చేతికి వచ్చిన తర్వాత మాత్రం అవన్నీ మర్చిపోతుంటారు. కానీ.. రేవంత్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు

Update: 2023-12-31 04:59 GMT

‘మార్పు’ నినాదంతో ఎన్నికల్లో కోట్లాడటం.. అందుకు తగ్గట్లే అధికారాన్ని సొంతం చేసుకున్న రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతల్ని చేపట్టిన తర్వాత కూడా అనునిత్యం ‘మార్పు’ మీదనే ఫోకస్ చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.గతంలో ముఖ్యమంత్రిని కలవటం అంటే కొద్ది మందికి మాత్రమే కుదిరే పని అన్న భావనను పూర్తిగా మారేలా ఆయన చేస్తున్నారు. అందుకు తగ్గట్లే పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విపక్ష నేతగా ఉన్నప్పుడు వివిధ వర్గాల వారిని గుర్తు పెట్టుకొని మాట్లాడటం.. వారి సమస్యలను ప్రస్తావించటం మామూలే.

ఒకసారి అధికారం చేతికి వచ్చిన తర్వాత మాత్రం అవన్నీ మర్చిపోతుంటారు. కానీ.. రేవంత్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయాన్ని తాను గుర్తు పెట్టుకున్నట్లుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్ని చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ ఉద్యమ వేళలో.. ఉద్యమం కోసం తన డీఎస్పీ ఉద్యోగాన్ని త్యాగం చేసిన నళిని ప్రస్తావనను తీసుకొచ్చిన సీఎం రేవంత్.. ఆమెకు తగిన ఉద్యోగాన్ని ఇవ్వాలని.. ఆమెను సంప్రదించాలని పోలీసు అధికారుల్ని ఆదేశించటం తెలిసిందే.

ఈ క్రమంలో మాజీ డీఎస్పీ నళిని ఎపిసోడ్ అందరి మదిలోకి రావటమే కాదు.. ఆమెను వెతుక్కుంటూ మీడియా సైతం వెళ్లింది. అయితే.. తాను అధ్యాత్మిక చింతనలో బతుకుతున్నానని.. తనకు ఉద్యోగం వద్దని చెప్పిన ఆమె మాటలు వైరల్ అయ్యాయి. అయినప్పటికి.. ఆమెకు ఏదో ఒకటి చేయాలన్నట్లుగా రేవంత్ ఆలోచన.. చివరకు ఆమే స్వయంగా సెక్రటేరియట్ కు వచ్చి ముఖ్యమంత్రిని కలిసేలా చేసింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ కు ఒక రిక్వెస్టు.. మరో రిపోర్టు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. రిక్వెస్టు ఏమంటే.. తనకు ఉద్యోగం ఏమీ వద్దని.. కాకుంటే తాను ఏర్పాటు చేయాలనుకుంటున్న వేద సెంటర్ కు ఆర్థిక సాయం అందచేయాలని కోరారు. దీనికి సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించినట్లుగా ఆమె చెప్పారు. ఇక్కడే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రికి ఆమె ఒక రిపోర్టును అందజేశారు. ఉద్యమ సమయంలో తాను.. తన సహ ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలపై నివేదిక అందజేశారు. వీటితో పాటు.. కొన్ని పుస్తకాల్ని ఆయనకు బహుకరించారు.

మిగిలిన విషయాలు ఎలా ఉన్నా మాజీ డీఎస్పీ నళిని అందజేసిన రిపోర్టుపై రేవంత్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతి అంశంలోనూ మార్పును పక్కాగా కోరుకుంటున్న సీఎం రేవంత్..నళిని రిపోర్టుపై తీసుకునే నిర్ణయాలు సంచలనంగా మారతాయన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News