హస్తినను కుదిపేసిన భూకంపం!
దేశ రాజధాని ఢిల్లీని భూ కంపం భయపెట్టింది. తెల్లవారు జామున 5.30 నిమిషాలకు భూ ప్రకంపనలు రావడంతో నగర వాసులు హడలెత్తిపోయారు.
దేశ రాజధాని ఢిల్లీని భూ కంపం భయపెట్టింది. తెల్లవారు జామున 5.30 నిమిషాలకు భూ ప్రకంపనలు రావడంతో నగర వాసులు హడలెత్తిపోయారు. భూమి లోపల నుంచి భారీ శబ్దాలు రావడంతో అంతా భయాందోళన చెందారు. ఈ భూకంప కేంద్రం ఢిల్లీకి సమీపంలో చూపించింది. కాగా, రిక్టర్ స్కేల్ పై 4.0గా భూకంపం తీవ్రత నమోదైంది.
భూ కంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ కాళ్ల కింద నేల కదిలిపోవడంతో జనం ఇళ్లలోంచి పరుగులు తీశారు. భూ కంపం వచ్చినప్పుడు అరుదైన శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. భూమిలోంచి భారీ శబ్దాలు రావడంతో ఏమవుతుందోనని భయాందోళన కనిపించింది. అయితే భూమిలోపల ఐదు కిలోమీటర్ల లోతులో భూమి కంపించడం వల్ల భారీ శబ్దాలు వచ్చాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
సాధారణంగా తక్కువ లోతులో సంభవించే భూకంపాలు ఎక్కువ లోతులో వచ్చేవాటికంటే చాలా తీవ్రమైన ప్రభావం చూపుతాయంటారు. భూ ప్రకంపనలు భూమిపై వేగంగా చేరుకోవడమే ప్రధాన కారణం అంటున్నారు. అయితే ఢిల్లీలో వచ్చిన భూ కంపం తక్కువ లోతులో ఉన్నప్పటికీ పెద్దగా ప్రమాదం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. రాజధాని నగరాన్ని భయపెట్టిన భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకపోవడంతో ప్రభుత్వం కూడా ఉపశమనం పొందింది.