ఏపీ మీద ఈసీ ఫోకస్... సీరియస్ గానే...
ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగితే అది ఇంకా ముందుకు షెడ్యూల్ అవుతుంది అని రాజకీయ పార్టీలు ఆశతో ఉన్నాయి.
తెలంగాణాలో శాసనసభ ఎన్నికల పర్వాన్ని విజయవంతంగా పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఇపుడు పక్క తెలుగు రాష్ట్రం ఏపీ మీద ఫోకస్ పెట్టింది. ఏపీలో 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగితే అది ఇంకా ముందుకు షెడ్యూల్ అవుతుంది అని రాజకీయ పార్టీలు ఆశతో ఉన్నాయి.
ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తోంది. ముసాయిదా జాబితాలను అన్ని పోలింగ్ స్టేషన్ లలో ఉంచే కార్యక్రమం చేపట్టింది. జనవరి నాటికి తుది జాబితాను ప్రకటించేందుకు మెరుగులు దిద్దుతోంది. అయితే ముసాయిదా జాబితాయే ఇపుడు రాజకీయ పార్టీల మధ్య పేచీలు తెచ్చి పెడుతోంది.
అందులో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయని విపక్ష తెలుగుదేశం గగ్గోలు పెడుతోంది. ప్రతీ నియోజకవర్గంలో సగటున ఇరవై వేలకు తక్కువ కాకుండా భోగస్ ఓట్లను చేర్పించారని తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు. ఏపీవ్యాప్తంగా చూస్తే లక్షలలో దొంగ ఓట్లు ఉన్నాయని అంటోంది. దీని మీద ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేశారు.
ఈ నెల 7వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఏపీలో దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయబోతున్నారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈసీ కూడా దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టింది. ఏపీలో ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న వేళ తుది జాబితాను సాధ్యమైనంత తొందరగా రెడీ చేయాలని ఈసీ కసరత్తు చేస్తోంది.
అయితే దొంగ ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయని తెలుగుదేశం ఆరోపిస్తూంటే వైసీపీ కూడా ఇటీవల ఎస్ ఈసీని కలసి టీడీపీ మీద ఫిర్యాదు చేసి వచ్చింది. తెలుగుదేశం హయాంలోనే దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని వాటిని ఇంకా తొలగించలేదని వైసీపీ అంటోంది. అంతే కాదు తెలనగణా ఓటు హక్కు ఉన్న వారు ఏపీలో మరో ఓటు కలిగి ఉన్నారని వీటిని ఈసీ గుర్తించి తొలగించాలని కూడా వైసీపీ సరికొత్త ఫిర్యాదు చేసింది.
ఈ నేపధ్యంలో ఈసీ ఇపుడు ఏపీలో గ్రౌండ్ లెవెల్ పరిస్థితులను తెలుసుకోవాలని చూస్తోంది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏపీకి వస్తారని తెలుసోంది. ఈ నెల 22, 23 తేదీలలో ఢిల్లీ నుంచి కేంద్ర ఈసీ అధికారులు ఏపీలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుంటారని అంటున్నారు
ఏపీలో భోగస్ ఓట్లు ఉంటే ఎక్కడ ఉన్నాయి. ఎలా చేరాయి అన్న దాని మీద ఈసీ పంపుతున్న ప్రత్యేక అధికారులు పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తారని తెలుస్తోంది. అలాగే లోతైన పరిశీలన కూడా ఉంటుందని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అయి వారి నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారని దొంగ ఓట్లను తొలగించే విషయంలో సీరియస్ గానే యాక్షన్ లోకి దిగుతారని అంటున్నారు.
ఇదిలా ఉంటే వైసీపీ ఆరోపణల ప్రకారం అరవై నుంచి డెబ్బై లక్షల దొంత ఓట్లు ఏపీవ్యాప్తంగా ఉన్నాయని అంటున్నారు. టీడీపీ అయితే ప్రతీ నియోజకవర్గంలో ఇరవై వేల పై దాటి దొంగ ఓట్లు ఉన్నాయని చెబుతోంది. మరి ఈ రెండింటి మీద ఈసీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి అసలు గుట్టు తేలుస్తుంది అని అంటున్నారు.
ఇక ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశలా మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు దొంగ ఓట్లు ఎక్కడ ఉన్నాయన్న దాని మీద పూర్తిగా పరిశీలన చేస్తున్నారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులను వారు నమోదు చేసుకుని మరీ భోగస్ ఓట్ల ఆటకట్టించేందుకు సమాయత్తమవుతున్నారు. మరి ఈ దొంగ ఓట్ల ఆరోపణలు ఎంత వరకూ నిజం లక్షలలో ఓట్లు భోగస్ వి ఉంటాయా అన్నది చూడాల్సి ఉంది. ఈసీ మాత్రం ఈ విషయంలో సీరియస్ గానే ఉంది అంటున్నారు.