ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ గాలం?... ఆ టిక్కెట్ ఆఫర్?
అవును... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తాచాటాలని భావిస్తుంది
తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ... 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తాచాటాలని బలంగా భావిస్తుంది. ఈ సమయంలో మెజారిటీ లోక్ సభ స్థానాల్లో విజయం సాధించాలని.. తద్వారా కేంద్రంలో అధికారం సాధించడానికి ఒక్కో ఇటుకా పేర్చాలని ఫిక్సయ్యిందని తెలుస్తుంది. ఈ సమయంలో తెలంగాణలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష మొదలుపెట్టిందని తెలుస్తుంది!
అవును... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తాచాటాలని భావిస్తుంది. అందుకోసం అవసరమైన అన్ని ఎత్తులూ వేస్తోంది! ఇందులో భాగంగా తెలంగాణలోని కీలక నేతల్లో ఒకరైన ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఒక లోక్ సభ స్థానాన్ని ఆఫర్ చేసిందని ప్రచారం జరుగుతుంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు కేసీఆర్ పై పోటీచేసిన గజ్వేల్ లోనూ ఈటల ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. బీజేపీలో పార్లమెంట్ స్థానాలకు ఉన్న పోటీ దృష్ట్యా ఆయనకు సీటు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇదే అదనుగా ఈటల మాంచి సీటును కాంగ్రెస్ ఆఫర్ చేసిందని నెట్టింట ఒక ప్రచారం వైరల్ గా మారుతుంది.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లోనూ కనీసం 10కి తగ్గకుండా గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు! దీంతో బలమైన అభ్యర్థులను, వీలైనంతవరకూ స్థానిక అభ్యర్థులను బరిలోకి దించాలని ప్లాన్ చేస్తోంది! ఈ సమయంలో కరీంనగర్ లో గతంలో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ స్థానం నుంచి గెలిచారు. అనంతరం మంత్రి పదవి దక్కించుకున్నారు.
దీంతో కరీంనగర్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త అభ్యర్థిని నిలబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థి కంటే... ఈటల రాజేందర్ అయితే బాగుంటుందని, గెలుపులు సులువు అవుతుందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుందంట. దీంతో ఆయనను పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ సీటు ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా... ఈటల రాజేందర్ మెదక్, మల్కాజ్ గిరి నుంచి బీజేపీ లోక్ సభ టిక్కెట్ ఆశిస్తున్నారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే మెదక్ నుంచి రఘునందన్ రావు, మల్కాజ్ గిరి నుంచి మురళీధర్ రావు సహా పలువురు నేతలు పోటీలో ఉన్నారు. దీంతో ఈ రెండు స్థానాలు ఆయనకు దక్కే అవకాశాలు లేవనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... కాంగ్రెస్ వేస్తున్నట్లు చెబుతున్న గాలం వాస్తవమైతే.. అది ఏ మేరకు వర్కవుట్ అవుతుందనేది వేచి చూడాలి!