హాట్ టాపిక్... 'తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేధమా'..?

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో అత్యంత ఆసక్తికరమైన పరిణామం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2024-05-02 04:08 GMT

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో అత్యంత ఆసక్తికరమైన పరిణామం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత అరుదుగా అని భావించినా.. అత్యంత సంచలనంగా అని చెప్పుకున్నా... ఊహించని పరిణామం కేసీఅర్ కు ఎదురైంది.. బీఆరెస్స్ శ్రేణుల అనుభావంలోకి వచ్చింది! ఇందులో భాగంగా... 48గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఈసీ కేసీఆర్ పై నిషేధం విధించింది. దీంతో... ‘తెలంగాణ గొంతుపైనే నిషేధమా..?’ అనే చర్చ నెట్టింట మొదలైంది!

అవును... తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారాలు హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మూడు పార్టీల అగ్ర నేతలు, కీలక నేతలు తమ తమ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారాలు చేస్తున్నారు. ఇక బీఆరెస్స్ కి స్టార్ క్యాంపెయినర్ అయిన కేసీఆర్... "పోరుబాట" పేరున ఇప్పటికే జనాల్లో బలంగా తిరుగుతున్నారు.. తమ పార్టీ అభ్యర్థులను ముందుగానే ఫైనల్ చేసి, వారి తరుపున ప్రచారాలు చేస్తున్నారు. ఈ సమయలో ఈసీ షాకిచ్చింది!!

దీనిపై కేటీఆర్ ఆన్ లైన్ వేదికగా రియాక్ట్ అయ్యారు! బీఆరెస్స్ అధినేత కేసీఆర్ ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధిస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇదెక్కడి అరాచకం...?" అంటూ ట్వీట్ చేశారు. అదే సమయంలో.. మోడీ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎన్నికల కమిషన్ ఏమని సమాధానం చెబుతుందంటూ నిలదీశారు! వారిద్దరి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోని ఈసీ, కేసీఆర్ పై మాత్రమే చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు!

ఈ విధంగా... "ఇదెక్కడి అరాచకం...?

ఏకంగా తెలంగాణ ఆవాజ్ కేసీఆర్ గొంతు పైనే నిషేధమా..?

మోడీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా..?

రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా..?

బడే భాయ్..చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది..!

కేసీఆర్ పోరు బాటతో బీజేపీ, కాంగ్రెస్ లు ఎందుకు వణుకుతున్నాయి..?" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

వాస్తవానికి.. కేసీఆర్ పై ఈసీ నిషేధం విధించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ మాండలికం అంటే బూతులే, సంస్కార రహిత వ్యాఖ్యలే అన్నట్లుగా కేసీఆర్ మార్చేశారని.. నాడు ఉద్యమ సమయంలో ఆంధ్రప్రాంత వాసులపై ఇష్టానురీతిగా మాట్లాడేవారని.. నాడు ఏపీ వాసులు ఊరుకున్నారని, నేడు ఎన్నికల కమిషన్ ఊరుకోదుగా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు!

ఇదే సమయంలో... ఈ నిషేధం తెలంగాణ ఎన్నికల్లో బీఆరెస్స్ కు పాజిటివ్ గా, కేసీఆర్ కు సింపతీగా మారే అవకాశం లేకపోలేదని.. తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ - కాంగ్రెస్ లు కలిసి, కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తున్నాయని ప్రజలు అనుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేమని.. తెలంగాణ గొంతుకగా మారి, రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తిపై అదే రాష్ట్రంలో ప్రచారం చేసుకోవద్దని నిషేదమా అని.. మరికొందరు అభిప్రాయపడుతున్నారు!

ఇక తాజాగా ఈ వ్యవహారంపై ఆన్ లైన్ వేదికగా వార్ నడుస్తుంది! ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో మోడీ, రేవంత్ రెడ్డి చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ.. ఈసీని ట్యాగ్ చేస్తున్నారు పలువురు నెటిజన్లు!

ఈ నేపథ్యంలో... ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఇది ఈసీ నిర్ణయం కాబట్టి.. నో కామెంట్ అనేది పరిశీలకు ఫైనల్ వర్డ్!!

ఈసీ చర్యలపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్!:

ఎన్నికల సంఘం తన ప్రచారంపై విధించిన ఆంక్షలపై బీఆరెస్స్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవితకు మద్దతుగా మహబూబాబాద్ రోడ్‌ షోలో పాల్గొన్న ఆయన... ప్రచారంలో పాల్గొనవద్దని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించిందని వెల్లడించారు.

అయితే... సీఎం రేవంత్ రెడ్డి.. పేగులు మెడకేసుకుంటా, గుడ్లు పీకుతా అని విమర్శలు చేసినప్పటికీ.. ఆయనపై ఈసీ నిషేధం విధించలేదన్నారు. ఎలక్షన్‌ కమిషన్ 48 గంటలు తన ప్రచారంపై నిషేధం విధిస్తే.. గులాబీ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారంటూ కేసీఆర్ కామెంట్ చేశారు.

Tags:    

Similar News