పోస్టల్ బ్యాలెట్ టెన్షన్ : చెల్లియో...చెల్లకో...!

పోస్టల్ బ్యాలెట్ ఈసారి ఎక్కువగా జరిగింది. ఏకంగా నాలుగున్నర లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయని చెబుతున్నారు.

Update: 2024-05-26 13:30 GMT

పోస్టల్ బ్యాలెట్ ఈసారి ఎక్కువగా జరిగింది. ఏకంగా నాలుగున్నర లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయని చెబుతున్నారు. ఇందులో కూడా అత్యధిక శాతం విపక్ష కూటమికి వెళ్ళాయని ఆ పార్టీలు ధీమాగా ఉన్న నేపధ్యం ఉంది.

ఈ నేపధ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లడం మీద కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్దిష్టమైన ఆదేశాలను జారీ చేసింది. దాని ప్రకారం చూస్తే కనుక కొంత వెసులుబాటుని కల్పించింది. అదే సమయంలో రిటర్నింగ్ అధికారి సంతకం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

రిటర్నింగ్ అధికారి సీల్ అంటే అధికారిక ముద్ర లేని పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో నెలకొన్న అనిశ్చితిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఆర్వో సీల్ లేకపోయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని ఈసీ నిర్దేశించింది. ఆర్వో సీల్ లేకపోయినా ఆర్వో సంతకం ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.

అయితే ఫారం-13ఏలో అన్ని వివరాలతో పాటు ఆర్వో సంతకం కూడా ఉండాలని స్పష్టంగా పేర్కొంది. ఆ పోస్టల్ బ్యాలెట్లు అప్పుడే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. ఒకవేళ ఫారం-13ఏలో ఓటరు సంతకం, ఆర్వో సంతకం బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ ను తిరస్కరించవచ్చు అని ఈసీ వివరించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.

పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈసీ జారీ చేసిన తాజా మార్గదర్శకాలను ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా జిల్లాల రిటర్నింగ్ అధికారులకు పంపించారు. దాంతో ఇపుడు పోస్టల్ బ్యాలెట్ లో చెల్లే ఓట్లు ఎన్ని చెల్లని ఓట్లు ఎన్ని అన్న కొత్త చర్చకు తెర లేస్తోంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ వేసేది ఉద్యోగులు అయినా చెల్లని ఓట్లు కూడా గతంలో గణనీయంగా ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే 2019 ఎన్నికల్లో 2.95 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ హక్కు ఉపయోగించుకుని ఓటు వేస్తే అందులో అక్షరాలా 56 వేల 545 ఓట్లు చెల్లలేదు

ఇది నిజంగా ఆశ్చర్యకరమైనదే. ఎందుకు చెల్లలేదు ఉద్యోగులు విద్యావంతులే కదా అంటే అక్కడే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఓటు వేయాలన్న ఆత్రుతతో కొన్ని నిబంధలను పాటించకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది అని అంటున్నారు. ప్రాతీ పోస్టల్ బ్యాలెట్ మీద గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలి. అపుడే అది చెల్లుబాటు అవుతుంది. గతంలో అలా చెల్లకుండా పోయినవే అర లక్షకు పైగా ఉన్నాయి.

ఈసారి చూస్తే కనుక అలా రిటర్నింగ్ అధికారి సంతకం లేని పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని అన్న చర్చ సాగుతోంది. ఈసారి పోస్టల్ పోలింగ్ విశేషం ఏమిటి అంటే వెల్లువలా ఓటింగ్ చేశారు. దాంతో గడువుని కూడా ఎక్కువగానే పెంచారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ జరగడానికి పెరిగిన గడువు కారణం. దాంతో చివరి నిముషంలో ఓట్లు వేసిన వారు టెక్నికల్ గా తమ ఓటు చెల్లుబాటు అయ్యేలా ఎంతవరకూ చూసుకున్నారు అన్నది కీలకమైన ప్రశ్న.

ఈసీ గైడ్ లైన్స్ లో ఆర్వో సంతకం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. ఆర్వో సీల్ లేకపోయినా వాటిని ఓకే చేయమంది. మరి సంతకం లేకుండా ఓట్లు వేస్తే మాత్రం అవి చెల్లకుండా పోతాయన్న కంగారు ఉద్యోగులలో కంటే ఆ ఓట్లు తమకు అనుకూలం అనుకుంటున్న పార్టీలలో ఉంది. గతసారి రమారమి మూడు లక్షలకు పైగా ఓట్లు పోల్ అయితే అందులో 20 శాతం పైగా ఓట్లు చెల్లలేదు. ఈసారి నాలున్నర లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో ఎంత శాతం చెల్లుతాయి, ఎన్ని ఓట్లు తిరస్కరణకు గురి అవుతాయన్నది కూడా టెన్షన్ పెడుతోందిట.

ఈసారి ఉద్యోగులే తమకు కేటాయించిన కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ చేశారు. మరి ఈ కంగారులో ఆర్వో సీలు మరచినా సంతకం మరచిపోతేనే కొంప మునుగుతుంది అని అంటున్నారు. అయితే సంతకం లేకపోయినా ఆ ఓట్లను చెల్లుబాటు అయ్యేలా చూడాలని ఇంతకు ముందే కూటమి ఈసీని కోరింది. అయితే సీల్ వరకే వెసులుబాటు వచ్చింది. దాంతో ఎన్ని ఓట్లు ఈసారి చెల్లవు అన్నది కూడా ఆసక్తిని పెంచే విషయమే అంటున్నారు.

Tags:    

Similar News