బ్రేకింగ్... మోడీ, రాహుల్‌ వ్యాఖ్యలపై ఈసీ నోటీసులు!

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే.

Update: 2024-04-25 10:11 GMT

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రధానంగా కాంగ్రెస్ - బీజేపీ నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ క్రమంలో అటు నరేంద్ర మోడీ, ఇటు రాహుల్ గాంధీల మాటల యుద్ధాలు పీక్స్ కి చేరుతున్నాయి. ఈ క్రమంలో కోడ్‌ ఉల్లంఘన కింద బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దీంతో... ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది!

అవును... లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తమ తమ ప్రసంగాల్లో చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథయంలో... విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వీరిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో... వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. కోడ్‌ ఉల్లంఘన కింద భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది.

వివరాళ్లోకి వెళ్తే... ఇటీవల రాజస్థాన్‌ లోని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తూ ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను మైనార్టీలకు పంచి పెడుతుందని, మహిళల మంగళసూత్రాలను వదిలిపెట్టదని ప్రధాని దుయ్యబట్టారు. దీంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తి ప్రధాన మంత్రేనా అంటూ తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి.

మరోపక్క... రాహుల్ గాంధీ తన ప్రసంగాలతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారని, పేదరికంపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది! దళితుడిననే కారణంతో తనను అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించలేదంటూ ఖర్గే ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘించారనేది కమలం పార్టీ ఫిర్యాదు!

ఇలా రాజస్థాన్‌ లో ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. ఇదే సమయంలో రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ ఫిర్యాదులను స్వీకరించిన ఈసీ తొలిసారి ఉల్లంఘనగా భావించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధినేత మల్లికార్జున్‌ ఖర్గేకు నోటీసులిచ్చింది.

ఇందులో భాగంగా ఏప్రిల్‌ 29 ఉదయం 11 గంటల్లోగా ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నోటీసుల్లో ఎక్కడా మోడీ, రాహుల్‌, ఖర్గే పేర్లను ఈసీ నేరుగా ప్రస్తావించలేదు కానీ... అభ్యర్థులు, స్టార్‌ క్యాంపెయినర్ల ప్రవర్తనకు రాజకీయ పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని మాత్రం స్పష్టం చేసింది.

Tags:    

Similar News