పోస్టల్ బ్యాలెట్ లెక్క తేలిపోతుందా ?
నాలుగు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉంటే ఉందులో ఎనభై రెండు శాతం అంటే మూడు కోట్ల పాతిక లక్షల మంది దాకా ఓటు హక్కుని ఈసారి ఉపయోగించుకున్నారు.
ఏపీలో ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రధాన పార్టీలు ఒక బిగ్ సైజ్ వార్ ని నడుపుతున్నాయి. నాలుగు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉంటే ఉందులో ఎనభై రెండు శాతం అంటే మూడు కోట్ల పాతిక లక్షల మంది దాకా ఓటు హక్కుని ఈసారి ఉపయోగించుకున్నారు.
అందులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నాలుగున్నర లక్షలకు పైగా అని చెబుతున్నారు. మరి ఈ మొత్తం చూస్తే చాలా స్వల్పం కానీ ఎందుకు వీటి చుట్టూ రాజకీయం అంతా తిరుగుతోంది అంటే ఇవే ఆక్సిజన్ గా చివరిలో నిలిచేవి, ఇవే మొగ్గుని ఎటు వైపో చెప్పి అభ్యర్ధిని గట్టెక్కించేవి అని అంతా నమ్మబట్టే అని అంటున్నారు.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఒక రూల్ ఏపీకి సెపరేట్ రూలా అంటూ వైసీపీ హై కోర్టుకు వెళ్ళింది. దానికి కారణం ఇటీవల ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా కూడా అనుమతించాలని సూచించింది.
అంతే కాదు రిటర్నింగ్ అధికారి సంతకం ఒక్కటే ఉంటే సరిపోతుందంటూ ఆదేశాలు జారీ చేసింది. సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించవద్దని స్పష్టం చేసింది. అలాగే 13ఏ మీద అటెస్టింగ్ అధికారి పేరు, వివరాలు లేకున్నా కూడా చెల్లుతుందంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇలా ఈసీ ఆదేశాలతో ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా జిల్లాలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.
దాంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అత్యధిక శాతం చెల్లుబాటు అయ్యేలా కనిపిస్తున్నాయి. అదే జరిగితే అందులో అవకతవకలు కూడా ఉంటాయని అపుడు రాజకీయంగా చిక్కులు వస్తాయని వైసీపీ కోర్టు తలుపు తట్టింది. అసలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఆర్వో సీల్ లేకపోతే అది అసలు నకిలీదో ఎలా తెలుస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేసుకునేందుకు ఎక్కడికక్కడ ఫెసిలెటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
ఆ సెంటర్లలో రిటర్నింగ్ అధికారి ఉంటారు. అక్కడ వేసే ప్రతీ ఓటు మీద ఆయన సంతకం సీలు ఉండాలి. అంతే కాదు ఓటు వేసే ఉద్యోగి పనిచేసే ప్లేస్, ఆయన హోదా వంటివి కూడా ఉండాలి. దేశమంతా ఇలాగే రూల్ ఉంది. మరి ఒక్క ఏపీకే ఎందుకు సడలిస్తున్నారు అని వైసీపీ ప్రశ్నిస్తోంది.
దీని మీద ఈసీ ఇచ్చిన మెమో అన్నది ఏ మాత్రం సబబు కానే కాదని వైసీపీ వాదన లేవనెత్తుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ విచారించింది. పిటిషన్ విచారణ సందర్భంగా వాడిగావేడిగా ఇరు పక్షాల వాదనలు జరిగాయి.
అలా రెండు వైపుల నుంచి వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పుని మాత్రం రిజర్వ్ లో పెట్టింది. ఆ తీర్పుని జూన్ 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు వెలువరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఆ తీర్పు ఎలా ఉండబోతోంది అన్నదే ఇక్కడ టెన్షన్ గా ఉంది.తీర్పు వైసీపీకి అనుకూలంగా వస్తే ఒక రకంగా వ్యతిరేకంగా వస్తే మరో రకంగా రాజకీయం ఉంటుంది అని అంటున్నారు.