అమావాస్య దాటింది.. ఇక అదురుడే..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇప్పటికే కోలాహలంగా సాగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇప్పటికే కోలాహలంగా సాగుతోంది. అధికార పార్టీ బీఆర్ ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని దంచికొడుతున్నాయి. నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శల పర్వాలు కొనసాగుతున్నాయి. ఫైర్ బ్రాండ్ నాయకుల నుంచి అగ్ర నేతల దాకా ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే!.
ఎందుకంటే.. నామినేషన్ల ఘట్టం వరకు అభ్యర్థులు(అన్ని పార్టీల్లోనూ) ప్రచారంపై పెద్దగా దృష్టి పెట్టలే దు. ఆస్తులు, అప్పులు, అఫిడవిట్లు, నేతల బుజ్జగింపులు, రెబల్స్‌తో రాజీలు.. నామినేషన్ల ఉప సంహరణ వంటి అనేక అంశాలపై దృష్టి పెట్టారు. అయినప్పటికీ.. ప్రచారం మాత్రం నిన్న మొన్నటి వరకు జోరుగానే సాగింది. కానీ, ఇప్పుడు నామినేషన్ల ఘట్టానికి సంబంధించిన తంతు పూర్తయింది. దీంతో నేతలు కొంత రిలీఫ్ అయ్యారు.
ఫలితంగా ప్రచారంపైనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. అదేసమయంలో దీపావళి అమావాస్య సెంటి మెంటు కూడా సోమవారంతో ముగిసిపోనుంది. అమావాస్య తర్వాత నుంచి ప్రచారానికి ఖచ్చితంగా 17 రోజుల గడువు ఉంటుంది. ఈ 17 రోజులను కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకుని ప్రచారాన్ని దంచి కొట్టాలని నేతలు, పార్టీలు కూడా నిర్ణయించాయి. కాంగ్రెస్ అగ్రనేతలు, రాహుల్, ప్రియాంకలతోపాటు.. చివరి మూడు రోజులు సోనియాగాంధీ కూడా ప్రచారంలో పాల్గొననున్నారు.
ఇక, బీఆర్ ఎస్ తరఫున సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కొన్నినియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. అయితే.. మరోసారి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించారు. ఇక, బీజేపీ అగ్రనేతలు.. మోడీ, అమిత్ షాలతోపాటు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు ఇక్కడ పర్యటనకు రెడీ అయ్యారు. మోడీ షెడ్యూల్ ప్రకారం.. మరో నాలుగు సార్లు.. వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసి ఎన్నికల ప్రచారంలో ఊపు తేనున్నారని తెలుస్తోంది. మొత్తంగా .. నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క అనే తరహాలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరి వాడి.. వేడెక్కనుందని అంటున్నారు పరిశీలకులు.