తెలంగాణ ఎన్నిక‌ల వేళ‌.. జ‌న‌సేన‌కు ఊహించ‌ని దెబ్బ‌!

అన్ని పార్టీల‌కు కూడా చాలా ఇంపార్టెంట్ అంశం.. ఎన్నిక‌ల్లో గుర్తు. ఈ విష‌యంలో రాజ‌కీయ పార్టీలు ఎక్క‌డా రాజీ ప‌డ‌వు

Update: 2023-11-10 15:50 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. అక్క‌డ బీజేపీతో పొత్తులో ఉంటూ.. ఎనిమిది స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిల బెట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. అది కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు జ‌నసేన ఏవిధంగా ముందుకు సాగు తుంది? ఎలాంటి స్టెప్ వేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

ఏం జ‌రిగింది?

అన్ని పార్టీల‌కు కూడా చాలా ఇంపార్టెంట్ అంశం.. ఎన్నిక‌ల్లో గుర్తు. ఈ విష‌యంలో రాజ‌కీయ పార్టీలు ఎక్క‌డా రాజీ ప‌డ‌వు. ప్ర‌జ‌ల్లో ఎంత ప్ర‌చారం చేసినా.. ఎంత పేరున్న నాయ‌కుడికైనా 'గుర్తు' చాలా కీల‌కం. ఈ విష‌యంలో తేడా వ‌స్తే.. కొంప‌లు మునిగిపోతాయి. అందుకే ఎన్నిక‌ల సంఘం ద‌గ్గ‌ర గుర్తును నిర్దేశించుకునేప్పుడే.. చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇలానే జ‌న‌సేన‌కు గాజు 'గ్లాస్‌' గుర్తును కేంద్ర ఎన్నిక‌ల సంఘం కేటాయించిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఇది ఏపీ వ‌ర‌కే ప‌రిమిత‌మైంది. ఈ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన కూడా గుర్తించ‌లేక పోయింది. తీరా అభ్య‌ర్థుల నామినేష‌న్ ఘ‌ట్టం కూడా పూర్త‌యి పోయిన త‌ర్వాత‌.. ఎన్నిక‌ల సంఘం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. గ్లాస్ గుర్తును రిజ‌ర్వ్ చేసిన‌ట్టు ఆర్వోలు ప్ర‌క‌టించారు. ఇది ఒక ర‌కంగా షాకింగ్ ప‌రిణామం. ఎందుకంటే.. ఒక‌వైపు అభ్య‌ర్థులు ప‌వ‌న్ ఫొటోతోపాటు గ్లాస్ గుర్తును ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. కానీ, ఇంత‌లోనే ఈ గుర్తును ఎన్నిక‌ల సంఘం రిజ‌ర్వ్ చేయ‌డం వారికి మింగుడు ప‌డ‌డం లేదు.

ఎందుకిలా జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ ప్ర‌స్తుతం ఏపీకే ప‌రిమిత‌మైంద‌ని ఎన్నిక‌ల సంఘానికి ఇచ్చిన అఫిడ‌విట్‌లో గ‌తంలోనే పేర్కొంది. అంటే తెలంగాణ‌లో ఈ పార్టీని ఎన్నిక‌ల సంఘం గుర్తించ‌లేదు. దీంతో ఏపీలో ఉన్న గ్లాస్ గుర్తును తెలంగాణ‌లో కంటిన్యూ చేయ‌లేదు. ఫ‌లితంగా జ‌న‌సేన గుర్తు లేకుండా పోయింది.

ఇప్పుడు ఏం జ‌రుగుతుంది?

జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేస్తున్న ఎనిమిది అభ్య‌ర్థుల‌ను స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జ‌రిగితే.. ఒక్కొక్క‌రికి ఒక్కొక్క గుర్తును కేటాయించ‌నున్నారు. లేదా.. ఎనిమిది మంది క‌లిసి ఉమ్మ‌డి గుర్తును కోరుకుంటే.. అప్పుడు ఎన్నికల సంఘం ఆలోచించే అవ‌కాశం ఉంది. లేక‌పోతే.. ఎవ‌రి గుర్తును వారే ప్ర‌చారం చేసుకోవాలి.

ఎవ‌రికి న‌ష్టం?

ప్ర‌స్తుతం జ‌న‌సేన‌కు ఎదురైన ఈ ప‌రిణామంతో ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఇబ్బందేనని అంటున్నారు ప‌రిశీల‌కులు. బీజేపీ ఇక్క‌డ జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంది. అయితే.. ఇప్పుడు దీనికి ప్రాంతీయ పార్టీగా కూడా గుర్తింపు లేద‌ని ఎన్నిక‌ల సంఘం తేల్చేసింది. మ‌రి ఇలాంటి ఏ గుర్తింపు లేని పార్టీతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పొత్తు పెట్టుకోవ‌డం ఆ పార్టీ బ‌ల‌హీన‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌నే విమ‌ర్శ‌లు, రాజ‌కీయ దాడులు త‌థ్య‌మ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News