ఏపీ ఓటర్లు.. మొత్తం లెక్కలివే!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నిర్వహణకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నిర్వహణకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఒకే రోజు ఎన్నికలు నిర్వహిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి ఏప్రిల్ 25తో సమయం ముగిసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ కూడా ముగిసింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల మొత్తం వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం ఓటర్లు 4,14,01,887 అని ఎన్నికల సంఘం వెల్లడించింది. వీరిలో 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళలు ఉన్నారు. అలాగే 3,421 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు. వీరితోపాటు రాష్ట్రంలో 68,185 మంది సర్వీస్ ఓటర్లు సైతం ఉన్నారు.
జనవరి 22, 2024న అర్హత తేదీగా పరిగణించి తుది ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లు ఉన్నారని మీనా తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుండి హింసాత్మక ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అలాగే 156 మంది గాయపడ్డారని వివరించారు. అదేవిధంగా మార్చి 16 నుంచి మే 2 వరకు రూ.203 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన బంగారం, వెండి, ఉచిత వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా 85 ఏళ్లు పైబడిన 2,11,257 మంది ఓటర్లు, 5,17,227 మంది దివ్యాంగ ఓటర్లు తమ ఇళ్ల నుంచే ఓటు వేయడానికి అర్హులని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇలా తమ ఇళ్ల నుంచే ఓటు వేయడానికి మొత్తం 7,28,484 మంది ఓటర్లు ఉండగా 28,591 మందే దీనిని ఎంచుకున్నారు. మొత్తం 31,705 మంది అవసరమైన సేవల ఓటర్లు ఫారం–12డిని ఎంపిక చేసుకున్నారు.