జమిలిపై ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లేనా?

ఎంత స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ.. కొన్ని కీలక నిర్ణయాల్ని విపక్షాలతో కలిసి చర్చించాల్సిన అవసరం ఉంది.

Update: 2023-09-07 04:42 GMT

ఎంత స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ.. కొన్ని కీలక నిర్ణయాల్ని విపక్షాలతో కలిసి చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ.. ప్రధాని మోడీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సంస్కరణలు మంచివే. కానీ.. నలుగురిని కలుపుకోవాల్సిన అవసరాన్ని ఆయన పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించట్లేదు. ఓవైపు జమిలి ఎన్నికల పేరుతో హడావుడి మొదలు పెట్టిన ఆయన.. మరోవైపు ఇండియా పేరును భారత్ అంటూ తీసుకున్న నిర్ణయంతో మొదలైన అలజడి అంతా ఇంతా కాదు. అయితే.. ఇలాంటివేమీ పట్టించుకోని ఆయన తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతున్నారు.

ఇదిలా ఉంటే.. జమిలి ఎన్నికల మీద విపక్షాల వాదనను పెద్దగా పరిగణలోకి తీసుకోని ప్రధాని మోడీకి తగ్గట్లే.. ఆయన ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక వ్యాఖ్య చేసింది. జమిలి ఎన్నికల నిర్వహణ దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేయటం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ అంశాన్నిలా కమిషన్ అధ్యయనం చేయటంతో పాటు.. త్వరలో నిర్వహించే ప్రత్యేక పార్లమెంటు భేటీలో బిల్లు పెట్టనున్నట్లుగా చెబుతున్నారు.

కేంద్ర నిర్ణయానికి తగినట్లుగా ఈసీ సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంకేతంగా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ చేసిన ప్రకటన కీలకంగా అభివర్ణిస్తున్నారు. జమిలికి తాము సన్నద్దమన్న సంకేతాల్ని ఆయన ఇస్తున్నట్లుగా చెప్పాలి. దేశంలోని లోక్ సభ.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న బీజేపీ.. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అన్న ఆలోచనపై జరుగుతున్న రాజకీయ చర్చకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమా? అన్న ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

‘‘చట్టపరమైన నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించటానికి ఈసీ సిద్ధంగా ఉంది’’ అంటూ చేసిన వ్యాఖ్య చూస్తుంటే.. జమిలి దిశగా పరిణామాలు వేగంగా మారిపోనున్నట్లుగా అర్థమవుతుంది. మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన నేపథ్యంలో దానికి సంబంధించిన సన్నాహాలపై మాట్లాడిన సందర్భంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక సంకేతాన్ని తన మాటలతో చెప్పేశారు.

‘‘చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఐదేళ్ల పదవీకాలం ముగియటానికి ఆర్నెల్లు ముందు ఎన్నికలు ప్రకటించొచ్చు. రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఇదే పరిస్థితి ఉంది. మా పని ఎన్నికల్ని సమయానికి నిర్వహించటం. ఆ సమయం రాజ్యాంగం.. ప్రజాప్రాతినిధ్య చట్టంలో నిర్దేశించబడింది. చట్టపరమైన విధానాలు.. రాజ్యాంగం.. ఆర్ పీ చట్ట ప్రకారం.. ఎన్నికల నిర్వాహణకు మాకు ఆదేశాలు ఉన్నాయి. మేం అందుకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ చేసిన వ్యాఖ్యల్నిచూస్తే.. ఎన్నికల నిర్వహణకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘం తయారుగా ఉందన్న విషయం అర్థమవుతుంది. అంటే.. మోడీ సర్కారు మినీ జమిలికి రెఢీ అన్నంతనే.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడుతుందన్న మాట.

Tags:    

Similar News