షాకుల మీద షాకులు: కంప్లైంట్ అందితే కొరడా ఝుళిపిస్తున్నారంతే!
తాజాగా జరుగుతున్న ఎన్నికల వేళలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సంచలనంగా మారుతున్నాయి.
షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 2018లో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని చూసిన వారికి.. తాజాగా జరుగుతున్న ఎన్నికల వేళలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సంచలనంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వరుస పెట్టి కొరడా ఝుళిపిస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. జెట్ స్పీడ్ తో నిర్ణయాలు వెలువడుతున్న తీరు.. అధికారులకు ఒక పట్టాన మింగుడుపడని పరిస్థితి.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై గడిచిన రెండు వారాల్లో రెండు దఫాలుగా 22 మంది అధికారులపై వేటు పడిన వైనం చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యన ముగిసిన మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఆర్డీవో స్థాయి అధికారిని తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో జరిగిన ధన ప్రవాహం దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అలాంటి సమయాల్లోనూ చర్యలు అంతలా తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
అందుకు భిన్నంగా తాజాగా మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు నెలముందే ఎన్ ఫోర్సుమెంట్ ఏజెన్సీలను ఈసీ రంగంలోకి దించటం ఒక ఎత్తు అయితే.. తాజాగా జరుగుతున్న పరిణామాలు మరో ఎత్తుగా చెబుతున్నారు.
ఈ నెల మొదటి వారంలో ఎన్నికల సమీక్షా సమావేశాల్ని నిర్వహించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ..‘మీరు పని చేయకపోతే.. మీ చేత ఎలా పని చేయించాలో మాకు తెలుసు’ అంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే.. విధి నిర్వహణలో ఏ మాత్రం అలక్ష్యంగా వ్యవహరించినా.. చర్యలు వెంటనే తీసుకోవటం కనిపిస్తోంది. అధికారుల తీరుపై ఏ మాత్రం కంప్లైంట్ అందినా కొరడా ఝుళిపిస్తున్న వైనం కొత్త అనుభవాన్ని మిగులుస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఇంత జరిగినప్పుడు.. రానున్న రోజుల్లో మరెన్నిపరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు చర్చగా మారింది.