ఏపీలో నోటుకు ఓటు లెక్క మారుతోంది!

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సందడి క్లైమాక్స్ కి చేరుకుంది! ఎన్నికల ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో ప్రచారాలు పీక్స్ కి చేరుతున్నాయి

Update: 2024-05-11 07:02 GMT

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సందడి క్లైమాక్స్ కి చేరుకుంది! ఎన్నికల ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో ప్రచారాలు పీక్స్ కి చేరుతున్నాయి. ఈ సమయంలో ఓటుకు నోటు అంశం హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం, జరుగుతున్న ప్రచారం ప్రకారం... ఏపీలో ఎన్నికల్లో డబ్బు పంపిణీ కనీసం రూ.1000 గా ఉందని.. గరిష్టం ప్రస్తుతానికి రూ.5000 కు చేరిందని అంటున్నారు. దీంతో... ఏపీలో అన్ని విషయాల్లోనూ టఫ్ ఫైట్ నెలకొందని తెలుస్తుంది.

అవును... ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సందడి చివరి అంకానికి చేరుకుంది. శనివారం మైకులు మూగబోవడం.. ఆదివారం నేతల మౌనవ్రతం అనంతరం.. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ ప్రక్రియ కూడా చివరి దశకు చేరిందని అంటున్నారు. వాస్తవానికి గతంలో పోలింగ్ కు ముందు రోజు రాత్రి డబ్బుల పంపిణీ చేపట్టేవారని చెబుతుంటారు.

అయితే ఈసారి ఆ విషయంలోనూ ట్రెండ్ మార్చారు నేతలు! ఇందులో భాగంగా... పోలింగ్ కు నాలుగు రోజుల ముందే పంపిణీ ప్రారంభమైందని తెలుస్తుంది. ఇక ఈ పంపిణీ విషయంలో కూడా నేతల మధ్య అవగాహన ఉందని.. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు నేతలూ ఒక మాట అనుకుని.. ఇద్దరూ సమానంగా డబ్బులు పంచి.. నిర్ణయాన్ని ప్రజలకు వదిలేస్తున్నారని అంటున్నారు.

ఇలా ఇద్దరు నేతలూ ఒక మాట అనుకుని.. ఒక్కొక్కరూ వెయ్యి నుంచి పదిహేను వందల మేరకు డబ్బులు పంచుతున్నారని ప్రచారం జరుగుతుంది. మరోపక్క కొన్ని నియోజకవర్గాల్లో విపక్షాల కంటే అధికార పార్టీ నేతలు ఒక 'నోటు’ ఎక్కువగానే పంచుతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఉదాహరణకు జనసేనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజోలు నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి రూ.1000 పంచుతుంటే.. వైసీపీ అభ్యర్థి రూ.1500 వరకూ పంచుతున్నారనే ప్రచారం జరుగుతుంది.

కోనసీమ జిల్లాలోని ఆల్ మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లోనూ దాదాపుగా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో రాజమండ్రి రూరల్ లో వైసీపీ ఇప్పటికే రూ.1500 పంచిపెట్టగా.. టీడీపీ రూ.1000 పంచిపెడుతుందని ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో రాజమండ్రి సిటీ విషయానికొస్తే... అక్కడ ఓ ‘రెండు నోట్లు’ ఎక్కువగానే పంచుతున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా... రాజమండ్రి సిటీలో వైసీపీ రూ.2500 రూపాయలు పంచుతుంటే.. టీడీపీ అభ్యర్థి రూ.2000 ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దీంతో.. సిటీ ఓట్లు కాస్ట్లీ గురూ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఇక రాజానగరం విషయానికొస్తే... అక్కడ వైసీపీ ఇప్పటికే రూ.2000 పంచిపెట్టగా.. జనసేన అభ్యర్థి ఇంకా చేయి విదల్చడం లేదనే ప్రచారం తెరపైకి వచ్చింది!

ఇక ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో.. పరిస్థితి డూ ఆర్ డై అనేలా ఉన్న స్థానాల్లో.. ఓటుకు రూ.3000 నుంచి రూ.5000 వరకూ ఇస్తున్నారనే చర్చ ఇప్పుడు వైరల్ గా మారింది. వీటికి చీరలు, వెండి కుంకుమ బరిణెలు మొదలైనవి అదనం అనే కామెంట్లూ వినిపిస్తుండటం గమనార్హం. ఏది ఏమైనా... ఈ ఎన్నికల్లో నోట్ల ప్రవాహం పీక్స్ కి చేరిందని అంటున్నారు పరిశీలకులు.. అక్కడక్కడ పట్టుబడుతున్న నగదు అందుకు చిన్న ఉదాహరణ అని చెబుతున్నారు.

Tags:    

Similar News