బన్నీ అరెస్ట్‌పై మరోసారి స్పందించిన సీఎం..!
'పుష్ప 2:ది రూల్' సినిమా ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్టయిన సంగతి తెలిసిందే
'పుష్ప 2:ది రూల్' సినిమా ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఒక రోజు రాత్రి జైలు జీవితం గడిపిన తర్వాత మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అయ్యారు. బన్నీ అరెస్ట్, తదనంతర పరిణామాలు కొన్ని రోజుల పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడిచాయి. ఈ వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగానే కీలక వ్యాఖ్యలు చేసారు. దీనిపై తాజాగా మరోసారి స్పందించారు.
దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్ట్ పై మాట్లాడారు. ''ఒక స్టార్ హీరోని ఆ విధంగా అరెస్ట్ చెయ్యడం మంచిది కాదని చంద్రబాబు నాయిడు అన్నారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా?'' అని న్యూస్ యాంకర్ ప్రశ్నించగా.. ''ఎందుకు అరెస్ట్ చేసామో చంద్రబాబు నాయుడుకు పూర్తిగా తెలిసి ఉండదు. దేన్నైనా రెండువైపులా చూసినప్పుడు వేరేలా కనిపించవచ్చు'' అని రేవంత్ రెడ్డి బదులిచ్చారు. తొక్కిసలాటలో మహిళ చనిపోవడం అల్లు అర్జున్ చేతిలో లేకపోవచ్చు కానీ, పది రోజుల దాకా అతను వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకోలేదని అన్నారు.
''రెండు రోజుల ముందు అల్లు అర్జున్ పర్మిషన్ కోసం వస్తే, పోలీసులు దాన్ని నిరాకరించారు. అనుమతి లేకపోయినా అతను అక్కడికి వచ్చాడు. ఆయన సెక్యురిటీ సిబ్బంది అక్కడున్న జనాలను తోసేశారు. ఆ తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. ఒక మనిషి చనిపోవడం అనేది ఆయన చేతుల్లో లేకపోవచ్చు. కానీ ఆ మనిషి చనిపోయిన తర్వాత, 10-12 రోజుల వరకూ బాధిత కుటుంబానికి అతను భరోసా కల్పించలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది'' అని రేవంత్ రెడ్డి అన్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే అదే నేషనల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఈ వ్యయాహారంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ''అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారని అందరూ అడుగుతున్నారు తప్ప.. ఆయన వల్ల జరిగిన దుర్ఘనటనలో ఒక మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆ పిల్లాడు కోమాలో నుంచి బయటకు వచ్చాక కళ్ల ముందు తల్లి కనిపించకపోతే అతని పరిస్థితి ఏంటీ?, ఆ పేద కుటుంబం పరిస్థితి ఏంటీ అనేది ఒక్కరు కూడా ప్రశ్నించట్లేదు. అల్లు అర్జున్ ఒక సినిమా యాక్టర్. ఆయన వ్యాపారం చేస్తున్నాడు. సినిమాలు తీస్తున్నాడు.. డబ్బులు సంపాదిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాదిరిగానే అతను కూడా వ్యాపారం చేస్తున్నాడు. అలా కాకుండా ఏమైనా ఇండియా - పాకిస్తాన్ బోర్డర్‌కు వెళ్లి యుద్ధం చేసి దేశాన్ని గెలిపించాడా? సినిమా తీశాడు.. పైసల్ సంపాదించుకున్నాడు. అందులో గొప్పేముంది" అంటూ సీఎం షాకింగ్ కామెంట్స్ చేసారు.
కేసు కోర్టులో ఉన్నప్పటికీ తెలంగాణా సీఎం అసెంబ్లీ వేదికగా హీరో అల్లు అర్జున్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లొచ్చిన వ్యక్తి ఇంటిముందు సినీ సెలబ్రిటీలు అందరూ క్యూ కట్టారు. ఆ హీరోకు కాళ్లు చేతులు పోయినట్టు కన్నీళ్లు కారుస్తూ, అతడిని పరామర్శిస్తున్నారు.. నన్ను తిడుతున్నారు. అతనికి కాలు పోయిందా? కన్ను పోయిందా? చేయి పోయిందా? కిడ్నీలు దెబ్బ తిన్నాయా?.. అసలు ఇంతమంది సినీ ప్రముఖులు ఎందుకు పరామర్శించారు? హాస్పిటల్ లో ఉన్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు? అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ తర్వాత బన్నీ ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేయడం.. ఆ వెంటనే మంత్రులు, పోలీసు అధికారులు రంగంలోకి దిగి హెచ్చరికలు జారీ చేయటం.. బన్నీ ఇంటిపై రాళ్ల దాడి చేయడం వంటి ఘటనలు జరిగాయి' చివరకు ఇండస్ట్రీ పెద్దలు కలుగజేసుకొని ఈ వివాదాన్ని చల్లార్చారు.