ఎలక్టోరల్ బాండ్స్... ఏ పార్టీకి ఎన్నేసి వందల కోట్లంటే...?
పైగా మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీర్పు రాజకీయ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపించనుందని అంటున్నారు.
ఎన్నికల బాండ్ల పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ఇదే సమయంలో... ఆ బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఈ సమయంలో ఏ పార్టీకి ఎన్ని కోట్ల బాండ్లు ఉన్నాయనే అంశం చర్చనీయాంశం అయ్యింది.
పైగా మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీర్పు రాజకీయ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపించనుందని అంటున్నారు. ఇందులో ప్రధానంగా... ఈ తీర్పు బీజేపీకి గట్టి దెబ్బే అని చెప్పాలి. కారణం... ఇప్పటివరకు ఈ ఎన్నికల బాండ్ల రూపంలో ఆయా రాజకీయ పార్టీలకు దక్కిన విరాళాల్లో అత్యధిక వాటా బీజేపీదే!
వాస్తవానికి... రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఎన్నికల బాండ్ల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు 30 విడతల్లో కలిపి సుమారు 28వేల ఎన్నికల బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించింది. ఈ బాండ్ల మొత్తం విలువ రూ.16,518 కోట్లు!
అయితే 2017-18 నుంచి 2022-23 వరకు ఈ రూ.16,518 కోట్లలోనూ ఈ బాండ్ల ద్వారా ఏయే రాజకీయ పార్టీకి ఎంత విరాళం దక్కిందన్న వివరాలను తాజాగా సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఆ వివరాల ప్రకారం అత్యధికంగా బీజేపీ రూ.6,565 కోట్లు కలిగి ఉండగా... అత్యల్పంగా టీడీపీ రూ.146 కోట్ల విరాళాలను పొందింది.
సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో పేర్కొన్న వివరాల ప్రకారం...
బీజేపీ - రూ.6,565 కోట్లు
కాంగ్రెస్ - రూ. 1,122 కోట్లు
తృణమూల్ కాంగ్రెస్ - రూ. 1,093 కోట్లు
బిజూ జనతాదళ్ - రూ.773 కోట్లు
డీఎంకే - రూ.617కోట్లు
వైఎస్సార్సీపీ - రూ.382.44 కోట్లు
బీఆరెస్స్ - రూ. రూ.383 కోట్లు
టీడీపీ - రూ.146 కోట్లు
కాగా... 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు ఆయా రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మార్చి 13 లోగా వెబ్ సైట్ లో ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది.