ఈవీఎం హ్యాకింగ్ పై మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు!

గత కొన్ని నెలలుగా.. ప్రధానంగా గత కొన్ని రోజులుగా ఎలాక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (ఈవీఎం) లపై భారతదేశంలో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే

Update: 2024-10-20 10:30 GMT

గత కొన్ని నెలలుగా.. ప్రధానంగా గత కొన్ని రోజులుగా ఎలాక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (ఈవీఎం) లపై భారతదేశంలో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మిగిలిన రాష్ట్రాల సంగతి కాసేపు పక్కనపెడితే... ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ చర్చ మరోసారి బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అవును... భారతదేశంలో గత కొంతకాలంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ల పని తీరు, వాటిని హ్యాక్ చేయగలగడం మొదలైన అంశాలపై విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈవీఎంలపై స్పేస్ ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ సందర్భంగా వాటిపై సంచలన ఆరోపణలు చేశారు.

ఇందులో భాగంగా... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని ఆరోపించారు. ఓ టెక్ నిపుణుడిగా తనకున్న పరిజ్ఞానంతో ఈ విషయం చెబుతున్నానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించొద్దని, బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఇటీవల పెన్సిల్వేనియా లో జరిగిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన మస్క్... సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికలకు దూరంగా ఉంచాలని కోరారు. ఇదే సమయంలో... ఎన్నికల ఓట్ల లెక్కింపు చేతులతో, బ్యాలెట్ పేపర్ తో జరగాలని అన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అయితే ఈవీఎంలపై మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. భారత్ లో ఈ ఏడాది లోక్ సభ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఈవీఎంలపై మస్క్ స్పందించారు. వాటి వాడకాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. దీనిపై స్పందించిన బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్... భారత్ లో తయారయ్యే ఈవీఎంలను హ్యాక్ చేయడం జరగదని చెప్పుకొచ్చారు!!

Tags:    

Similar News