ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్ ఏ స్థాయిలో అంటే... మస్క్ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే
ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై రకరకాల భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చాలా రంగాల్లో ఈ సేవలు వినియోగిస్తుండగా.. ఫ్యూచర్ లో ఈ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు భారీగా తగ్గిపోతాయని అంటున్నారు. ఈ సమయంలో ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పరిశోధనలు ఓ వైపు ఆసక్తి రేకెత్తిస్తుంటే.. మరోవైపు ఆసక్తికరంగా తెరపైకి వస్తున్న కొన్ని విషయాలు మాత్రం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు కనుమరుగవుతాయనే వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.
ఇందులో భాగంగా... ఏఐని మనుషుల్లా చూడడం ఆపాలని ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గట్టిగానే హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్యారిస్ కేంద్రంగా "వివా టెక్" పేరిట నిర్వహించిన స్టార్టప్ సదస్సులో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఫ్యూచర్ లో అన్ని ఉత్పత్తులు, సేవలను ఏఐ ఆధారిత సాధనాలు, రోబోలే అందిస్తాయని అంచనా వేశారు.
అదే జరిగిన రోజు మనకెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చని చెప్పిన మస్క్... ఫ్యూచర్ లో అవసరమైతే ఒక వ్యాపకంగా మాత్రమే ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులు రావొచ్చని తెలిపారు. అయితే.. ఆ స్థితికి చేరుకోవడానికి ప్రపంచంలో ప్రతిఒక్కరికీ "యూనివర్సల్ హై ఇన్ కమ్" ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంటే... అందరికీ పెద్ద మొత్తంలో ఆదాయం ఉండాలని పరోక్షంగా సూచించారన్నమాట.
ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఎలాన్ మస్క్ ఓ కీలక సూచన చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా... సోషల్ మీడియాల్లో పిల్లలు గడిపే సమయాన్ని నియంత్రించాలని సూచించారు. ప్రధానంగా సోషల్ మీడియాకు అలవాటు పడటం కోసం డోపమైన్ అనే హార్మోన్ ను పెంచే విధంగా ఏఐతో ప్రోగ్రామ్ చేస్తున్నారని మస్క్ వెల్లడించారు. దీన్ని "ఫీల్ గుడ్ హార్మోన్"గా వ్యవహరిస్తుంటారు మస్క్!
ఇదే సమయంలో... తనను వ్యక్తిగతంగా భయానికి గురిచేసేది "టెక్నాలజీ" మాత్రమేనని నొక్కి చెప్పిన మస్క్... గత కొన్నేళ్లలో ఏఐ సామర్థ్యాలు గణనీయంగా మెరుగయ్యాయని తెలిపారు. దీంతో ఈ అధునాతన సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా వినియోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వాలు, నియంత్రణా సంస్థలు, కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయని అన్నారు.