ఎలాన్ మస్క్ ని కూడా చంపాలని చూశారా?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై హత్యాయత్నం యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-15 07:06 GMT

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై హత్యాయత్నం యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా ప్రపచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ హత్యాయత్నంలో ట్రంప్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే ట్రంప్ పైనే కాదు.. తనపైనా ఒకటి కాదు రెండు సార్లు హత్యాయత్నం జరిగిందని ఎలాన్ మస్క్ తెలిపారు.

అవును... అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా... ఓ యువకుడు కాల్పులు జరిపాడు. దీంతో.. ట్రంఫ్ కుడి చెవి పైభాగం నుంచి ఓ తూటా దూసుకెళ్లింది. వెంట్రుక వాసిలో ట్రంప్ ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు.

ఈ సమయంలో రక్తమోడుతున్న గాయంతో ఒక్కక్షణం నిర్ఘాంతపోయిన ట్రంప్ చుట్టూ వెంటనే భదరతా బలగాలు వలయంగా ఏర్పడ్డాయి. ఈ సమయంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనను అక్కడ నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో... మరికొంతమంది దుండగుడిపై కాల్పులు జరిపి, అతడి తలను ఛిద్రం చేసి హతమార్చారు. ఈ నేపథ్యంలో... ఎలాన్ మస్క్ స్పందించారు.

ఇందులో భాగంగా... గత ఎనిమిది నెలల్లోనే తనపై రెండు సార్లు హత్యాయత్నం జరిగిందని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన నేపథ్యంలో తన సెక్యూరిటీని పెంచుకోవాలని మస్క్ కు ఓ నెటిజన్ సూచించారు.

ఈ సూచనకు రియాక్ట్ అయిన ఎలాన్ మస్క్... ఇప్పటికే గత ఎనిమిది నెలల్లో ఇద్దరు వ్యక్తులు, వేర్వేరు సందర్భాల్లో తనను చంపడానికి ప్రయత్నించారని వెల్లడించారు. ఇదే సమయంలో... టెక్సాస్ లోని టెస్లా హెడ్ క్వార్టర్స్ సమీపంలో వారు గన్స్ తో పోలీసులకు పట్టుబడ్డారని ఆయన పేర్కొన్నారు. దీంతో.. అమెరికాలో గన్ కల్చర్ తీవ్రతపై మరోసారీ బలమైన చర్చ మొదలైంది!

Tags:    

Similar News