మేము వెళ్లిపోతాం.. ట్రంప్ ఆఫర్ తో 40 వేల మంది ఉద్యోగులు రిజైన్
ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ (ఓపీఎం) ఇచ్చిన బై అవుట్ ఆఫర్ గడువు గురువారంతో ముగియనుంది.
ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగులు కళ్లు చెవులు... అయితే ఒక పరిమితికి మించితే మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.. పరిస్థితులు ప్రతికూలంగా మారితే జీతభత్యాలే గుదిబండ అవుతాయి. వారి రిటైర్మెంట్ బెనిఫిట్లు మరింత మోత మోగుతాయి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక అనేక సంస్కరణలు అమలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్లలో ఒకటి.. వాలంటరీ రిజైన్ స్కీమ్. అంటే ఉద్యోగులు వారంతట వారే వైదొలగడం అన్నమాట.
ట్రంప్ ఏ ముహూర్తంలో ఉద్యోగాల కోత నిర్ణయం ప్రకటించారో కానీ.. ఆ వ్యూహం క్రమంగా ఫలితం ఇస్తోంది.
ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ (ఓపీఎం) ఇచ్చిన బై అవుట్ ఆఫర్ గడువు గురువారంతో ముగియనుంది. ఉద్యోగాల నుంచి స్వచ్ఛందంగా వైదొలగే ఈ కార్యక్రమంలో 40 వేల మంది రాజీనామా చేసేందుకు అంగీకరించారట. ఉద్యోగుల రిజైన్ సంఖ్య కరెక్టేనని ఓపీఎం ధ్రువీకరిస్తున్నా..ట్రంప్ కార్యవర్గం ఊహించినదాని కంటే మాత్రం వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మున్ముందు వేగంగా పెరుగుతుందని మాత్రం భావిస్తున్నారు.
బై అవుట్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ 20 లక్షల మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకుంటే ఎనిమిది నెలల జీతం ఇస్తామని పేర్కొంది. దీనికి గడువు గురువారం (ఫిబ్రవరి 6).
2 లక్షల నుంచి 3 లక్షల వరకు..
మెయిల్స్ పంపిన 20 లక్షల మందిలో 10-15 శాతం మంది రిజైన్ చేయొచ్చని ట్రంప్ సర్కారు ఊహిస్తోంది. అంటే 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు అన్నమాట. ఇప్పటికైతే 40 వేల మంది మాత్రమే తప్పుకొన్నారు. ఇక ఉద్యోగాల నుంచి స్వచ్ఛందంగా వైదొలగినవారికి సెప్టెంబరు వరకు జీతం ఇస్తారు. కచ్చితంగా ఇస్తారనేది మాత్రం చెప్పలేం.
ట్రంప్ చేపట్టిన తొలగింపులు విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గుతాయట.