గజ్వేల్ కోటకు గండి కొట్టేందుకు రంగంలోకి ఈటల!

ఈటల రాజేందర్ ఇప్పుడు గజ్వేల్ లో పోటీ చేస్తున్నారు. హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లోనూ ఆయన సమరానికి సై అంటున్నారు.

Update: 2023-11-06 16:30 GMT

తెలంగాణలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసి, ప్రచారంలో బీఆర్ఎస్ ను పరుగులు పెట్టిస్తున్నారు కేసీఆర్. అయితే మరోవైపు కాంగ్రెస్, బీజేపీ.. బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేయాలని ప్రత్యర్థి పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో ప్రధానంగా కేసీఆర్ ను ఓడించాలనే పట్టుదలతో ఉన్నాయి. అందుకే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గజ్వేల్ బరిలో దిగారు. ఇక్కడ కేసీఆర్ కు తొలిసారి ఓటమి రుచి చూపించాలనే దిశగా ఈటల ప్రయత్నాలు సాగుతున్నాయి.

గజ్వేల్ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్, టీడీపీ హవా కొనసాగింది. కానీ ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక.. కేసీఆర్ గజ్వేల్ కు వచ్చారో అప్పటి నుంచి మరో పార్టీకి ఇక్కడ చోటే లేకుండా పోయింది. వరుసగా రెండు ఎన్నికల్లో ఇక్కడి నుంచి కేసీఆర్ ఘన విజయాలు సాధించారు. ఇప్పుడు మూడోసారి కూడా విజయదుందుభి మోగించాలనే పట్టుదలతో ఉన్నారు. కానీ ఈ సారి అదంత సులువుగా కనిపించడం లేదు. ఎందుకంటే కేసీఆర్ ను ఎదురించి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దాటి గెలిచిన ఈటల రాజేందర్ ఇప్పుడు గజ్వేల్ లో పోటీ చేస్తున్నారు. హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లోనూ ఆయన సమరానికి సై అంటున్నారు.

కేసీఆర్ ను ఓడించి, గజ్వేల్ కోటకు గండి కొట్టాలని ఈటల చూస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ లోని కొంతమంది నాయకులను బీజేపీలో చేర్చుకున్నారు. అక్కడ ప్రచారాన్ని కూడా మొదలెట్టారు. మరోవైపు బీఆర్ఎస్ రెబల్ నాయకులు కూడా ఈటలకు మద్దతుగా నిలుస్తున్నారు. వరుసగా రెండు సార్లు కేసీఆర్ ను గెలిపించినా నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని అక్కడ అసంత్రుప్తి వినిపిస్తోంది. ఇది ఈటలకు కలిసి రానుంది. మరోవైపు పార్టీ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉండటంతో కేసీఆర్ కు ఓటమి రుచి చూపించాలనే ధ్యేయంతో ఈటల సాగుతున్నారు.

Tags:    

Similar News