కాంగ్రెస్‌ నేతలతో ఈటల ఆసక్తికర భేటీ అందుకేనా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయాయి. దీంతో ఇప్పుడు అన్ని పార్టీలు వచ్చే పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించాయి.

Update: 2024-02-17 06:37 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయాయి. దీంతో ఇప్పుడు అన్ని పార్టీలు వచ్చే పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించాయి. తెలంగాణలో 17 లోక్‌ సభ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీలైనన్ని స్థానాలను తమ ఖాతాలో వేసుకోవడానికి అన్ని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.

ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండటంతో వివిధ పార్టీల నేతలు ఆ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. వివిధ సర్వేలు కూడా కాంగ్రెస్‌ పార్టీయే అత్యధిక ఎంపీ సీట్లను కొల్లగొడుతుందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు కాంగ్రెస్‌ చేరడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ కు చెందిన పలువురు జెడ్పీ చైర్మన్లు, ముఖ్య నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్‌ లో చేరడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తాజాగా బీజేపీ ముఖ్య నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కాంగ్రెస్‌ లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు. ఆయన తాజాగా పలువురు కాంగ్రెస్‌ నేతలతో భేటీ కావడం ఇందుకు ఊతమిస్తోందని అంటున్నారు.

వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ముందే ఈటల రాజే ందర్‌ పార్టీ మారతారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన బీజేపీ తరఫునే గజ్వేల్, హుజురాబాద్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరి మల్కాజిగిరి లేదా కరీంనగర్‌ లోక్‌ సభా స్థానాల నుంచి పోటీ చేయడానికి ప్లాన్‌ చేసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈటల రాజేందర్‌.. కాంగ్రెస్‌ నేతలు.. పట్నం మహేందర్‌ రెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలతోపాటు కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి చర్చించినట్టు తెలుస్తోంది.

కాగా బీఆర్‌ఎస్‌ నేతలు పట్నం మహేందర్‌ రెడ్డి, వికారాబాద్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫకృద్దీన్‌ తదితరులు కూడా కాంగ్రెస్‌ లో చేరిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ కూడా బీఆర్‌ఎస్‌ నేతల బాటలోనే హస్తం గూటికి చేరుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల పార్టీ మారుతారా? ఎంపీ ఎన్నికల బరిలో నిలుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, వీరి భేటీకి సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Tags:    

Similar News