ఈటల రాజేందర్ దారెటు?

గతంలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీని ఓడించి అధికారం దక్కించుకున్న ఈటల రాజేందర్ కు తల పొగరు ఎక్కింది.

Update: 2023-12-25 04:30 GMT

తెలంగాణలో బీజేపీ హవాను అడ్డుకుని కాంగ్రెస్ లబ్ధిపొందింది. బీజేపీనే తన సొంత తెలివితేటలతో అధికారం దూరం చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీపై చేసిన ప్రచారం బాగా పనిచేసింది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు ఒక్కటే అని బాగా ప్రచారం చేయడం వల్ల ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగింది. ఫలితంగా రాష్ట్రంలో బీజేపీకి అనూహ్య పరాభవం ఎదురైంది. దీంతో నేతలు అంతర్మథనంలో పడిపోయారు. తమదే అధికారం అని గొప్పలు చెప్పుకున్నా చివరకు అపజయమే పలకరించడం గమనార్హం.

బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నంత కాలం పార్టీ ప్రతిష్ట ఇనుమడించింది. మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుట్రల వల్ల బండి సంజయ్ ను అధిష్టానం అధ్యక్షుడిగా మార్చేసింది. దీంతో పార్టీ ప్రతిష్ట మసకబారింది. కాంగ్రెస్ పుంజుకుంది. అధికారం దక్కించుకుంది. ఇది ముమ్మాటికి బీజేపీ నేతల తప్పిదమే అని తేలింది. ఈటల రాజేందర్ నిర్వాకం వల్లే బీజేపీ తీవ్రంగా నష్టపోయింది.

ఈటల రాజేందర్ కూడా వాపును చూసుకుని బలుపుగా భావించుకున్నారు. గతంలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీని ఓడించి అధికారం దక్కించుకున్న ఈటల రాజేందర్ కు తల పొగరు ఎక్కింది. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ తో పాటు కేసీఆర్ మీద గజ్వేల్ లో కూడా పోటీకి నిలిచారు. కానీ ఓటర్లు రెండు చోట్ల కీలెరిగి వాత పెట్టారు. దీంతో పరాభవం మూటకట్టుకున్నారు.

బీజేపీలో కీలక నేతగా ఎదిగినా పార్టీని నయవంచనతో నష్టాల్లోకి నెట్టారనే అపవాదు మూటగట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అంతర్మథనంలో పడిపోయారు. తనకు ఎదురు లేదని భావించినా చివరకు నిరాశే మిగిలింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీకి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు. బీజేపీలో దమ్మున్న లీడర్లుగా పేరుతెచ్చుకున్న బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ లు అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తరువాత వారికి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు ఇస్తారో లేదో అనే చర్చలు కూడా వస్తున్నాయి.

ప్రస్తుతం ఓటమి చెందిన ఈటల దారెటు అనే చర్చ కూడా సాగుతోంది. హుజురాబాద్ నుంచి ఏడు సార్లు గెలిచిన ఈటలను ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఈటలను ఎందుకు పక్కన పెట్టారు? అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈటల ఎటు వెళతారనే చర్చ కూడా వస్తోంది. పార్టీ మారతారనే వార్తలు గతంలో పలుమార్లు చక్కర్లు కొట్టాయి. బీజేపీలో ఉన్న పేరు కాస్త పోవడంతో పార్టీ మారి తన భవిష్యత్ పై కొత్త ఆశలతో ముందుకు వెళ్తారో లేదా బీజేపీలోనే ఉండి తన పట్టు నిలుపుకుంటారో లేదా వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News