ఢిల్లీ పరేడ్ లో ఏటికొప్పాక హైలెట్

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటికొప్పాక అన్నది ఎంతో ప్రసిద్ధి గాంచింది. బొమ్మల తయారీలో ఈ గ్రామం మంచి పేరు తెచ్చుకుంది

Update: 2025-01-26 23:30 GMT

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటికొప్పాక అన్నది ఎంతో ప్రసిద్ధి గాంచింది. బొమ్మల తయారీలో ఈ గ్రామం మంచి పేరు తెచ్చుకుంది. ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో వరహ నది ఒడ్డున ఉండడం చేతనే ఏటికొప్పాక అనే పేరు ఈ ఊరుకు వచ్చింది.

ఇక్కడ లక్కబొమ్మలు తయారుకు ప్రసిద్ధి అన్నది తెలిసిందే. ఇటీవలనే ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ఏటికొప్పాక బొమ్మల గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇక ఏపీ నుంచి ఈసారి ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు పంపిన శకటాలలో ఏటికొప్పాక శకటం అందరి దృష్టిని ఆకట్టుకుంది.

కేంద్ర పెద్దలు అంతా ఈ బొమ్మలతో కూడిన శకటాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకలకు హాజరైన ప్రజలు కూడా ఎంతో ఆశ్చర్యానుభూతులకు గురి అయ్యారు. ఇక చూస్తే కనుక ఏటికొప్పాక కళాకారులు తయారు చేసిన బొమ్మలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, అలాగే గణపతి ఎంతగానో ఆకట్టుకున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలలో అందమైన ఏటికొప్పాక బొమ్మలతో కూడిన ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా మన శకటం నచ్చిందని అన్నారు.

అంతే కాకుండా ఇతర ప్రముఖులు కూడా ఏపీ శకటం పట్ల ఆసక్తి ప్రదర్శించారని తెలిపారు. ఏటికొప్పాక బొమ్మలు కళాకారుల సృజనాత్మకతకు మారుపేరు అని చంద్రబాబు అభివర్ణించారు. ఏపీ శకటం రూపకల్పనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా తమ ప్రాంతం నుంచి వెళ్ళిన ఏటికొప్పాక శకటం అందరికీ నచ్చిందని అంతా మెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఏటి కొప్పాకను అన్ని విధాలుగా ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఇక్కడ ప్రజలకు జీవనోపాధిగా బొమ్మల తయారీ ఆధారంగా ఉంది. దీంతోనే వారు తరాలుగా బతుకుతున్నారు. తాము తయారు చేసిన బొమ్మలకు జాతీయ అంతర్జాతీయంగా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని వారు కోరుతున్నారు. అదే విధంగా తమ ఊరి పేరు గొప్పగా ఉన్న తమ జీవితాలు అయితే అంత గొప్పగా లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Tags:    

Similar News