నేను పోటీలోనే ఉన్నా.. ఎక్కడ నుంచి అనేది చెబితే.. గందరగోళం: నాగబాబు
ఈ సందర్భంగా పలువురు జనసేన పార్టీ నాయకులు ఎక్కడ నుంచి పోటీచేస్తున్నారని ఆయనను ప్రశ్నించారు.
''నేను పోటీలోనే ఉన్నా.. అయితే ఎక్కడ నుంచి అనేది మాత్రం ఇప్పుడే చెప్పను. లేనిపోని గందరగోళం సృష్టించను'' అని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలోనే ఉన్న ఆయన.. తాజాగా పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు జనసేన పార్టీ నాయకులు ఎక్కడ నుంచి పోటీచేస్తున్నారని ఆయనను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా నాగబాబు మాట్లాడుతూ..''నేను పోటీలోనే ఉన్నా. ఖచ్చితంగా పోటీ చేస్తా. అయితే..రాజకీయాల్లో వ్యూహాలు మారుతుంటాయి. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. కాబట్టి ఎక్కడ నుంచి పోటీ చేస్తానని ఇప్పుడు చెప్పును'' అని వ్యాఖ్యానించారు.
అయితే.. నాగబాబు ఆలోచన ప్రకారం.. ఆయన వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి లేదా.. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పార్ల మెంటుకు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అనకాపల్లిపైనే పోకస్ చేసిన ఆయన త్వరలోనేకాకినాడ నాయకు లతోనూ నాలుగు రోజుల పాటు మీటింగ్ పెట్టేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన.. ఆయన త్రిముఖ పోరులో వైసీపీ నేత.. రఘురామకృష్ణరాజు చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో కాపులు, శెట్టిబలిజలు ఎక్కువగా ఉన్న అనకాపల్లి, లేదా.. కాకినాడ పార్లమెంటు స్థానాల నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.
రాజధానిపై..
ఏపీ రాజధాని అమరావతికే తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు నాగబాబు చెప్పారు. దీనిపై అన్ని పార్టీలూ సానుకూలంగానే ఉన్నాయని.. ఒక్క వైసీపీ మాత్రమే గోడదూకుడు నిర్ణయాలు చేస్తోందని.. దీనిని ప్రజలు తిప్పికొడుతున్నారని అన్నారు. విశాఖలో ఎవరూ రాజధాని కావాలని తనను కోరలేదన్నారు.'నేను చాలా మంది నాయకులను కలిశాను ఎవరూ.. మాకు రాజధానిగా విశాఖ కావాలని కోరలేదు. మరి వైసీపీకి అంత దురద ఎందుకో అర్ధం కావడం లేదు. ఏదో అయిపోయింది. ఇప్పటికైనా వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేకపోతే.. ఎలాగూ మేమే అధికారంలోకి వస్తున్నాం కాబట్టి.. అమరావతినే రాజధానిని చేస్తాం'' అని నాగబాబు వ్యాఖ్యానించారు.