ఆ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నా.. సక్సెస్ కాలేదే!!
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాపూరావు.. కొత్తదారులు వెతుకుతున్నారు.
ఒకటి కొంటే ఒకటి ఉచితం అనేది వ్యాపార ప్రకటన. అదేవిధంగా రాజకీయాల్లో నాయకులు కూడా.. ఒకటి పోతే ఇంకోటి ఉంది అనే నినాదాన్ని.. విధానాన్ని కూడా తరచుగా పాటిస్తారు. అంటే.. ఒక పార్టీలో తమకు అనుకూల పరిస్థితి లేకపోతే.. మరో పార్టీని వారు ఎంచుకుంటారు. కానీ, ఇక్కడ కూడా.. వారికి ఎదురు గాలి వీస్తే.. ఏం చేస్తారు? ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణలోని బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు ఎదురైంది.
ఆయన పరిస్థితి కుడితోపడ్డ ఎలుక చందంగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. బోధ్ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్ తరఫున రాథోడ్ బాపూరావు విజయం దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఆయన బీఆర్ ఎస్ తరఫునే విజయం సాధించారు. అయితే.. అనూహ్యంగా ఆయన విషయంలో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదు.
బీఆర్ ఎస్ తరఫున బోధ్ టికెట్ ను రమేశ్ జాదవ్‌కు కేసీఆర్ కేటాయించారు. దీంతో బాపూరావు సంచలన నిర్ణయం తీసుకుని వెంటనే కాంగ్రెస్‌లోకి జంప్ చేసేశారు. తనకు సిట్టింగ్ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ నేతల తోనూ ఆయన విన్నవించారు. అయితే, కాంగ్రెస్ ఊరించి ఊరించి.. ఈ టికెట్‌ను తాజాగా వెన్నెల అశోక్‌కు కేటాయించారు. దీంతో బాపూరావు పరిస్థితి దారుణంగా మరింది. సంచలన నిర్ణయం తీసుకుని పార్టీ మారినా టికెట్ మాత్రం ఆయనకు దక్కలేదు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాపూరావు.. కొత్తదారులు వెతుకుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా అయినా ఆయన పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. అటు అధికార పార్టీ, ఇటు కాంగ్రెస్‌లు కూడా రాథోడ్‌బాపూరావుకు టికెట్ కేటాయించకపోవడం వెనుక.. సర్వే ఎఫెక్ట్ ఉందనే చర్చ సాగుతోంది. బాపూరావు ఈసారి చిత్తుగా ఓడిపోనున్నారనే చర్చ సాగుతున్న నేపథ్యంలో రెండు పార్టీల్లోనూ ఆయనకు ఎదురు గాలివీచింది.