ఆ మాజీ మంత్రి మైండ్ గేమ్ తో టీడీపీలో కలవరం!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఆశిస్తోంది.. టీడీపీ. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గంగా ఉన్న కైకలూరులో బీజేపీ మాజీ మంత్రి కారణంగా ఆ పార్టీ కలవరానికి గురవుతోందని టాక్ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఆశిస్తోంది.. టీడీపీ. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గంగా ఉన్న కైకలూరులో బీజేపీ మాజీ మంత్రి కారణంగా ఆ పార్టీ కలవరానికి గురవుతోందని టాక్ నడుస్తోంది. అందులోనూ కైకలూరు నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భవించాక ఒకే ఒక్కసారి గెలుపొందింది. 2009లో మాత్రమే టీడీపీ తరఫున జయ మంగళ వెంకట రమణ విజయం సాధించారు. అది కూడా వేయి ఓట్ల లోపు తేడాతోనే గెలిచారు. ఇప్పుడు ఆయన పార్టీలో లేరు. వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు.
2014లో టీడీపీ–బీజేపీ పొత్తులో భాగంగా కైకలూరు సీటు బీజేపీకి దక్కింది. దీంతో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్... వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాంప్రసాద్ పై విజయం సాధించారు. అంతేకాకుండా చంద్రబాబు మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 2019లో టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకట రమణపై వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు గెలిచారు.
కాగా 2014లో బీజేపీ తరపున గెలిచిన కామినేని శ్రీనివాస్ 2009లో ప్రముఖ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ తరఫున బరిలోకి దిగారు. కేవలం 974 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకట రమణ చేతిలో ఓడిపోయారు. కాగా వచ్చే ఎన్నికల్లోనూ కామినేని శ్రీనివాస్ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన.. ఇలా మూడు పార్టీల అధినేతలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఏ పార్టీ నుంచైనా ఆయన బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. కామినేని శ్రీనివాస్ ఇలా వ్యవహరించడం వల్లే మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ తనకు సీటు రాదని భావించి వైసీపీలోకి మారిపోయారని అంటున్నారు.
తాను బీజేపీలో ఉన్నప్పటికీ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని తానేనని కామినేని శ్రీనివాస్ ప్రకటించుకున్నారని చెబుతున్నారు. దీంతో టీడీపీలో కలవరం మొదలైందని అంటున్నారు. టీడీపీ టికెట్ ను ఆశిస్తున్న ముగ్గురు అభ్యర్థులు కామినేని తీరుతో కలవరం చెందుతున్నారని టాక్ నడుస్తోంది.
తాము గత నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో పార్టీని అనేక కష్టనష్టాలకోర్చి నడిపామని.. వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కొని.. పోలీసుల కేసులను భరించి టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ ముగ్గురు అభ్యర్థులు వాపోతున్నట్టు తెలుస్తోంది. తమ ముగ్గురిలో కాకుండా బీజేపీలో ఉన్న కామినేని శ్రీనివాస్ కు టికెట్ ఇస్తే సహించేది లేదని చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం.
మరోవైపు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదని భావిస్తోన్న కామినేని.. టీడీపీ, జనసేన పొత్తు కోసం ఎదురుచూస్తున్నారు. పొత్తు కుదిరితే ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నిలవాలని చూస్తున్నారు. టీడీపీ, జనసేనలకు సమర్థులైన అభ్యర్థులు లేరని.. కాబట్టే తనకు సీటు ఇస్తారనే ధీమాలో ఆయన ఉన్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం టీడీపీ తరఫున కైకలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ నంబూరి వెంకట రమణరాజు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, కొల్లేరుకు చెందిన సీనియర్ నేత ఏసుబాబు, యువ నాయకుడు కొడాలి వినోద్‌బాబు తదితరులు టికెట్ ను ఆశిస్తున్నారు. తమలో ఎవరో ఒకరిని ఇంచార్జిగా నియమించాలని కోరుతున్నారు.
తాజాగా కైకలూరు నియోజకవర్గంపైన సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ముగ్గురు అభ్యర్థులు.. వినోద్ బాబు, ఏసు బాబు, వెంకట రమణరాజులతో మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. అయితే టికెట్ ఎవరికనేది ఆయన ప్రకటించలేదు. మరోవైపు కామినేని శ్రీనివాస్ టికెట్ తనకే అని ప్రకటించుకుంటూ ఉండటంతో ఆ ముగ్గురు అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని టాక్ నడుస్తోంది.