పోలవరం పోస్ట్ మార్టం....దిగిపోయిన అంతర్జాతీయ నిపుణులు

పోలవరం విషయంలో ఏమి చేయాలన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.

Update: 2024-07-01 03:45 GMT

పోలవరం విషయంలో ఏమి చేయాలన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఒకసారి పోలవరం వెళ్ళి పూర్తి స్థాయిలో పరిశీలించి వచ్చారు. ఆ మీదట ఆయన పోలవరం విషయంలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు.

డయాఫ్రం వాల్ బీటలు వారిందని దానిని మరమ్మతులు చేయాలా లేక కొత్తది కట్టాలా అన్న దాని మీద జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి నిపుణులను పిలిపించి స్టడీ చేయిస్తామని బాబు చెప్పారు.బాబు చెప్పి రెండు రోజులు కాలేదు కానీ అంతర్జాతీయ నిపుణులు దిగిపోయారు. ఆది వారం నుంచి నాలుగు రోజుల పాటు పోలవరంలో ఈ నిపుణులు పూర్తి స్థాయిలో పరిశీలన చేయనున్నారు.

ఈ అంతర్జాతీయ నిపుణులలో అమెరికా కెనడాకు చెందిన నలుగురు ఉన్నారు. వారు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించి అక్కడి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం లో డయాఫ్రం వాల్ తో పాటు స్పిల్ వే, ఎగువ దిగువ కాఫర్ డ్యాం లని పరిశీలించింది.

ఢిల్లీలో రాష్ట్ర కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో సమావేశం అయి అన్ని విషయాలూ చర్చించిన ఈ అంతర్జాతీయ బృందం ఏపీలో పోలవరాన్ని ప్రత్యక్షంగా పరిశీలించింది. మరి లోటు పాట్లు లోపాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా చూస్తుంది ఏపీ ప్రభుత్వానికి ఏమని సలహా ఇస్తుంది అన్నది ప్రధానం.

డయాఫ్రం వాల్ కి మరమ్మత్తులు చేస్తే సరిపోతుందా లేక సమాంతరంగా కొత్తగా వాల్ నిర్మించాలా అన్నది చూడాల్సి ఉంది. కొత్త్గా వాల్ నిర్మాణం అంటే దాదాపుగా వేయి కోట్ల ఖర్చు. రెండు సీజన్ల దాకా ఆ పనికే పోతే అపుడు పోలవరం నిర్మాణం ఇంకా ఆలస్యం అవుతుంది.

అందువల్ల నిపుణుల బృందం ఇచ్చే ఒపీనియన్ వారి నివేదికలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాయి. పోలవరం ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వానికి అతి పెద్ద ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం గా ఉంది. పోలవరం పూర్తి చేసే 2029 ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

ఆయన ఎంత సీరియస్ గా దీనిని తీసుకున్నారు అన్నది చూస్తే కనుక వారం రోజుల తేడాలోనే అంతర్జాతీయ నిపుణుల బృందం రావడం అంటే మామూలు విషయం కాదు. ఒక విధంగా ప్రభుత్వం చిత్త శుద్ధిని అది తెలియచేస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా పోలవరం తొందరగా పూర్తి కావాలని దానికి సంబంధించి అనుకూలమైన సూచనలతో శుభవార్తనే అంతర్జాతీయ నిపుణుల బృందం వినిపించాలని అంతా కోరుకుంటున్నారు.

Tags:    

Similar News