పొత్తు ఆవశ్యకతపై వివరణ... తమ్ముళ్ల త్యాగాలపై బాబు క్లారిటీ!!
ఈ సందర్భంగా బీజేపీతో పొత్తు అవసరాన్ని వివరించడంతో పాటు.. ఫలితంగా కలిగే ప్రయోజనాలను సవివరంగా వెల్లడించారని తెలుస్తుంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొత్తు రాజకీయాలో మరో మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న మొన్నటివరకూ “టీడీపీ – జనసేన” గా ఉన్న పొత్తు ఇప్పుడు “టీడీపీ - బీజేపీ – జనసేన”గా మారుతుందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే హస్తిన వేదికగా ప్రధానంగా టీడీపీ - బీజేపీలు ఒక అవగాహనకు వచ్చాయని.. ఇక అధికారిక ప్రకటనే తరువాయని అంటున్నారు. తాజాగా హస్తిన టూర్ విషయాలను బాబు తమ్ముళ్లతో పంచుకున్నారని తెలుస్తుంది.
అవును... ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షా - బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అవ్వడం, పొత్తులపై చర్చించడం, సీట్ల సర్దుబాటుపై మాట్లాడటం వంటి విషయాలపై చంద్రబాబు.. పలువురు టీడీపీ సీనియర్ నేతలతో చర్చించారని తెలుస్తుంది. ఈ సందర్భంగా బీజేపీతో పొత్తు అవసరాన్ని వివరించడంతో పాటు.. ఫలితంగా కలిగే ప్రయోజనాలను సవివరంగా వెల్లడించారని తెలుస్తుంది. ప్రస్తుతం పార్టీ అభివృద్ధికి, ఈ ఎన్నికల్లో సత్తా చాటడానికి బీజేపీతో పొత్తు విలువను బాబు అర్ధమయ్యేలా చెప్పారని అంటున్నారు.
ఢీల్లీలో బీజేపీ పెద్దలతో భేటీలో జరిగిన చర్చల సారాంశాన్ని చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారని.. ఇందులో భాగంగా పొత్తు దాదాపు ఖాయమైందనే సంకేతాలు ఇచ్చారని తెలుస్తుంది. ఇదే సమయంలో ఎన్డీఏలో చేరాలని టీడీపీకి ఆహ్వానం అందిందని వెల్లడించారని తెలుస్తుంది. ఈ సమయంలో పార్టీ ప్రయోజనాల కోసం ఎన్డీఏలో చేరక తప్పదని చంద్రబాబు తమ్ముళ్లకు చెప్పినట్లు తెలుస్తుంది. ఒకరకంగా ఇది తప్పని పరిస్థితిగా మారిందని చెప్పినట్లు సమాచారం!
వాస్తవానికి టీడీపీకి జనసేనతో పొత్తు సరిపోతుందనే భావన పలువురు నేతలలో ఉందని అంటున్నారు. ఫలితంగా మైనరిటీ ఓటు బ్యాంకు నుంచి కూడా ఎన్నో కొన్ని ఓట్లు సంపాదించుకోవచ్చని చెబుతున్నారని తెలుస్తుంది. పైగా ఒక్క జనసేనతోనే పొత్తు వల్ల... రాష్ట్ర వ్యాప్తంగా కాపుల ఓట్లు రావడంతో పాటు టిక్కెట్లు ఆశిస్తున్న టీడీపీ నేతలు త్యాగాలు కూడా తక్కువగానే ఉంటాయనేది వారి భావన అంట! అయితే... ఈ సందేహాలను కూడా బాబు నివృత్తి చేశారని అంటున్నారు.
ఇందులో భాగంగా బీజేపీతో పొత్తు వల్ల మైనారిటీ ఓటు బ్యాంక్ పూర్తిగా పోయే ప్రమాదం ఉన్నప్పటికీ... వారికి కూడా నచ్చచెప్పుకునే ప్రయత్నం చేయాలని సూచించారంట. ఇక త్యాగాల సంగతి అంటే... అది తప్పదని కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేలుగా ప్రతిపక్షంలో ఉండటం కంటే.. కార్యకర్తలుగా అధికార పార్టీలో ఉండటం బెటరనే సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.
ఇదే సమయంలో... కేంద్రంలో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు సర్వేలు చెబుతున్న నేపథ్యంలో... ఈ సమయంలో ఎన్డీఏలో చేరడం వల్ల అటు పార్టీకి, ఇటు రేపు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుందని అనిపిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారని అంటున్నారు. ఫలితంగా... రాజధాని, పోలవరం వంటి నిర్మాణాల పని సులువు అవుతుందని చెప్పుకొచ్చారని అంటున్నారు.
ఏది ఏమైనా... అధికార ప్రకటన, సీట్ల సర్దుబాట్ల సంఖ్య సంగతి కాసేపు పక్కనపెడితే... టీడీపీ - జనసేన కూటమితో బీజేపీ పొత్తు కన్ ఫాం అయినట్లే అని అంటున్నారు. ఈ సమయంలో ఒక్కసారి కమిట్ అయ్యాక... చంద్రబాబు తన మాట తానే వినకపోవచ్చని... ఈ ఎన్నికలు ఆయనకు అంత ప్రాముఖ్యమైనవని... ఈ దఫా తేడా వస్తే ఇక చెప్పేదేమీ లేదనే విషయం బాబు కంటే బాగా ఎవరికీ తెలియకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు!!