5వ తరం యుద్ధ విమానం.. ఓడించడం ఎవరి తరమూ కాదు.. అదే అమెరికా ఎఫ్-35

అమెరికా ఆయుధ తయారీ దిగ్గజ సంస్థ లాక్‌ హీడ్‌ మార్టిన్‌ మరో రెండు సంస్థలతో కలిసి ఎఫ్-35లను తయారు చేస్తుంది.

Update: 2025-02-14 23:30 GMT

భారత్ వైమానిక ఆయుధ రంగంలో పొరుగున ఉన్న ప్రమాదకర చైనా కంటే చాలా వెనుకబడి ఉంది.. చైనా ఆరో తరం యుద్ధ విమానం తయారీలో ఉంటే భారత్ మాత్రం సుదూరాన ఎక్కడో ఉంది. మరి యుద్ధ విమానాల్లో మొనగాడు ఎవరంటే మాత్రం.. ఎఫ్‌-35 అని చెప్పక తప్పదు. ఇది అమెరికా అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఫైటర్‌ జెట్‌. వీటిని అసలు అమెరికా అంత తొందరగా ఎవరికీ ఇవ్వదు.

రష్యా నుంచి ఎస్‌-400 కొనుగోలు చేసినందుకు.. శిక్షగా నాటో కూటమి దేశమైన తుర్కియే కూ ఎఫ్-35లను అమ్మలేదు. కానీ, రష్యా ఎస్‌-400 వాడుతున్నప్పటికీ భారత్‌ కు ఎఫ్-35 లను అమ్ముతామని అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది.

వెరీ అడ్వాన్స్ డ్ ఎలక్ట్రానిక్‌ వార్ ఫేర్‌, నిఘా, పర్యవేక్షణతో ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న 5వతరం అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్‌-35 రాడార్లు, ప్రత్యర్థి ఎయిర్‌ డిఫెన్స్‌ ల కళ్లుగప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేస్తుంది. దీనిని 2 ట్రిలియన్‌ డాలర్లకు పైగా వెచ్చించి డెవలప్ చేశారట.

మూడు వేరియంట్లున్న ఎఫ్- 35లలో ఎఫ్‌-35ఎ బేసిక్. ఇది సుమారు రూ.695 కోట్లు (80 మిలియన్‌ డాలర్లు) ఉంటుంది.

రన్‌ వే లేకున్నా.. నిట్టనిలువునా గాల్లోకి ఎగరగల, ల్యాండ్‌ కాగల ఎఫ్‌-35బి రూ.990 కోట్లు (115 మిలియన్‌ డాలర్లు)

* విమాన వాహక నౌకల కోసమే డిజైన్‌ చేసిన ఎఫ్‌-35సి ధర రూ.955 కోట్లు పైనే (110 మిలియన్‌ డాలర్లు)ఉంటుంది.

అమెరికా ఆయుధ తయారీ దిగ్గజ సంస్థ లాక్‌ హీడ్‌ మార్టిన్‌ మరో రెండు సంస్థలతో కలిసి ఎఫ్-35లను తయారు చేస్తుంది. ఎఫ్‌ 135 ఇంజిన్‌, 40 వేల పౌండ్ల థ్రస్ట్‌ ఉత్పత్తి, అత్యధికంగా గంటకు 1.6 మాక్‌ (1200 మైళ్లు) వేగంతో ప్రయాణించగల సత్తా దీని సొంతం. రాడర్లలో అతి చిన్నగా కనిపిస్తుంది. ఏదో పక్షి అనుకుని శత్రు సైన్యం భ్రమించేలా చేయడమే కాక కొన్ని సందర్భాల్లో ఎయిర్‌ డిఫెన్స్‌ ల కళ్లుగప్పుతుంది.

ఇతర ఫైటర్‌ జెట్లలోలాగా ఎఫ్ 35లలో పరికరాలు, ఇతరాలు ఉండవు. భారీ టచ్‌ స్క్రీన్లు, హెల్మెట్‌ మౌంటెడ్‌ డిస్ప్లే పైలట్‌ కు సౌకర్యవంతంగా ఉంటాయి. రియల్‌ టైమ్‌ ఇన్ఫర్మేషన్‌ అందిస్తాయి. హెల్మెట్‌ ఖరీదే 4 లక్షల డాలర్లు. ఇది ఓ లగ్జరీ కారు రేటుతో సమానం.

యూకే, ఇటలీ, నార్వేలు ఎఫ్ 35 తయారీలో భాగస్వాములు. జపాన్‌, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్‌ కు వీటిని అమ్మిది అమెరికా. ఇరాన్‌ పై దాడుల్లో ఇజ్రాయల్ వీటిని వాడింది. భారత్ దగ్గర ప్రస్తుం రఫేల్‌ యుద్ధ విమానాలే ఉన్నాయి. ఇవి 4.5వ తరానివిగా చెబుతారు. గగనతలం నుంచి గగన తలంలోకి, గగనతలం నుంచి భూ ఉపరితలం పైకి దాడులు చేయగలవు. కానీ ఎఫ్‌-35 స్థాయి టెక్నాలజీ వీటిలో లేదు.

ఎఫ్‌-35 యుద్ధ విమాన నిర్వహణ చాలా ఖరీదు. గంట సేపు గాల్లో ఉంటే 36 వేల డాలర్లు ఖర్చవుతుంది. శిక్షణ, ప్రస్తుత ఆయుధాలతో అనుసంధానం, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ వంటివీ భారీ వ్యయంతో కూడినవే. భారత్‌ కు దశాబ్దాలుగా రష్యా ఆయుధాలు అందిస్తోంది. అమెరికా ఎఫ్‌-35లు వస్తే.. భారత్ రష్యా నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించాలి.

ఎఫ్‌-35లు బెంగళూరులోని ఏరో ఇండియా-2025లో పాల్గొన్నాయి.

Tags:    

Similar News