హైదరాబాద్ లో నకిలీ కాల్ సెంటర్... టార్గెట్ అమెరికా!

మూడు నకిలీ కాల్ సెంటర్ ఉదోగులను సైబరాబాద్ మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2023-08-12 08:50 GMT

నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అమెరికా పౌరుల్ని మోసం చేస్తున్న ఘరానా ముఠా గుట్టురట్టైంది. మీ పేరిట డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని, కేసు నుంచి బయటపడాలంటే పెనాల్టీ కట్టాలని బెదిరిస్తూ అమెరికా పౌరుల నుంచి వేల డాలర్లు కొట్టేస్తున్నారు. దోచుకున్న సొమ్మును క్రిప్టో మార్గంలో ఖాతాల్లో వేసుకుంటున్నారు.

ఆన్‌ లైన్ ఆర్డర్ పేరుతో అమెరికా పౌరులను బెదిరించి అందినకాడికి దోచుకుంటున్న మూడు నకిలీ కాల్ సెంటర్ ఉదోగులను సైబరాబాద్ మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో భాగంగా... 115మంది నిందితులను అరెస్టు పోలీసులు చేశారు! ఈ సమయంలో వారి వద్దనుంచి ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.

అవును... పోలీసులు పట్టుకున్న నిందితుల నుంచి ఏడు ల్యాప్‌ టాప్‌ లు, 115 సిపియూలు, మానిటర్లు, రూటర్లు, 120 మొబైల్ ఫోన్లు, ఒక ఆడి కారుతోపాటు రూ.2,55,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర గచ్చిబౌలిలోని కార్యాలయంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఎండి అన్సారి మోహిర్‌ ఫాన్.. ఎఆర్జే సోల్యూషన్ ని ఏర్పాటు చేశాడు. గంచి అకీబ్.. ఎజి సొల్యూషన్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ప్రదీప్ వినోద్ రాథోడ్.. వర్టేజ్ సొల్యూషన్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ఈ మూడు కంపెనీల్లోనూ ఉస్మాన్, శివం ప్రధాన్, దీపు థాపర్ లు కీలక వ్యక్తులు.

వీరంతా గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చి మాదాపూర్‌ లో మూడు నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో పని చేసేందుకు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన వారిని టెలీ కాలర్లుగా తీసుకున్నారు. నిందితులు అమెరికాకు చెందిన పౌరుల వ్యక్తిగత డేటా తీసుకుని ఫోన్లు చేస్తున్నారు.

ఈ సమయంలో తాము కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సెల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామని.. మీకు అనుమానస్పద పార్సిల్ వచ్చిందని బెదిరిస్తున్నారు. దీంతో... బయపడిన వారికి దీనిని నుంచి బయటపడేయాలంటే వెంటనే కొంత మొత్తం చెల్లించాలని చెప్పి బాధితుల నుంచి 3,000 డాలర్ల నుంచి 6,000 డాలర్ల వరకు వసూలు చేస్తున్నారు.

ఇదే సమయంలో బాధితులకు ఫోన్ చేసి అమెజాన్‌ లో వస్తువులను ఆర్డర్ చేశారని ప్రశ్నిస్తున్నారు. తాము ఎలాంటి ఆర్డర్ చేయలేదని, చెప్పడంతో లేదు మీ పేరుపై ఆర్డర్ ఉందని క్యాన్సిల్ చేస్తే యూఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని బెదిరిస్తున్నారు. బెదిరిన వారి వద్ద నుంచి డాలర్లు వసూలు చేస్తున్నారు.

అందులో వచ్చిన డబ్బులను క్రిప్టోకరెన్సీ నుంచి యూ.ఎస్‌.డి.టి మార్చి వాటిని ఇండియాలోని ఐ.ఎం.పి.ఎస్, యూపిఐ లావాదేవీల ద్వారా పంపిస్తున్నారు. ఇలా రెండేళ్ల నుంచి నిందితులు అమెరికా పౌరులను మోసం చేస్తున్నారు. ఇలా ఫోన్లు చేసి ఇప్పటి వరకు 20,733మందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News